డ్రగ్స్, సైబర్ క్రైమ్ లపై తెలుగు రాష్ట్రాల ఉమ్మడి పోరు

డ్రగ్స్, సైబర్ క్రైమ్ లపై తెలుగు రాష్ట్రాల ఉమ్మడి పోరు
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య  నెలకొన్న విభజనకు సంబంధించిన సమస్యల పరిష్కారంతో పాటు శనివారం హైదరాబాద్ లో సమావేశమైన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి రెండు రాష్ట్రాల ప్రజలకు సంబంధించిన సమస్యలపై కూడా దృష్టి సారించారు. ముఖ్యంగా యువతను నిర్వీర్యం చేస్తున్న డ్రగ్స్ మహమ్మారిపై ఉమ్మడి పోరు జరపాలని నిర్ణయించారు. అదేవిధంగా సైబర్ క్రైమ్ ను కట్టడి చేయడంలో సహితం ఉమ్మడిగా వ్యవహరించాలని భావించారు.
డ్రగ్స్, సైబర్ క్రైమ్స్‌పై ఇరు రాష్ట్రాలు కలిసి పనిచేయాలని నిర్ణయించామని తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. ఇక ఇటీవలె ఏపీలో కూడా యాంటీ నార్కొటిక్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయడం గమనార్హం. డ్రగ్స్ ను అరికట్టడం కోసం తెలంగాణ ప్రభుత్వం కూడా అడిషనల్‌ డీజీ స్థాయి అధికారితో ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తుందని చెప్పారు. సైబర్‌ క్రైమ్‌ సంబంధించి సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గుర్తుచేశారు.

ఈ రెండు అంశాల్లో రెండు రాష్ట్రాలు సమన్వయంతో పనిచేయాలని, డ్రగ్స్‌, సైబర్‌ క్రైమ్స్‌ను నియంత్రించాలని నిర్ణయించామని వివరించారు. ఈ మహమ్మారుల నుంచి రెండు రాష్ట్రాల ప్రజలను కాపాడుకునేందుకు అడిషనల్‌ డీజీ స్థాయిలో రెండు రాష్ట్రాల్లో కమిటీ ఏర్పాటు చేసుకొని.. సమన్వయంతో పని చేసుకుని వీటిని నియంత్రించాలని నిర్ణయించినట్టు వివరించారు.

డ్రగ్స్‌ ఫ్రీ రాష్ర్టాలుగా మార్చాలనే ఉద్దేశంతో ఉమ్మడి నిర్ణయాలు తీసుకున్నట్టు ఏపీ రెవిన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఏపీలో స్కూల్‌ బ్యాగుల్లో గంజాయి దొరికే పరిస్థితి దాపురించిందని చెప్పారు. ఏపీలో గంజాయి ఉత్పత్తి అయి హైదరాబాద్‌కు వస్తున్నదని, తెలుగు జాతిని కాపాడే లక్ష్యంగా సమిష్టి నిర్ణయాలు తీసుకున్నామని వివరించారు. రెండు వారాల్లో సీఎంలు హర్షించేలా మంచి విధానాలు జరుగుతాయని చెప్పారు. తెలుగు ప్రజలు హర్షించేలా కార్యచరణ ఉండబోతున్నదని స్పష్టం చేశారు.

,