
తెలంగాణలో 26 మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీ వైపు చూస్తున్నారని కేంద్ర సహాయ మంత్రిబండి సంజయ్ కుమార్ వెల్లడించారు. అయితే, నైతిక విలువలకు కట్టుబడి రాజీనామా చేసి వస్తేనే బిజెపిలో చేర్చుకుంటామనే షరతు విధించడంతో వెనక్కి తగ్గారని ఆయన తెలిపారు. నాడు కేసీఆర్ మాదిరిగానే నేడు కాంగ్రెస్ వ్యవహరిస్తుందని ఆ రెండు పార్టీల మాదిరిగా బీజేపీ అనుసరిస్తే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతారని ఎద్దేవా చేశారు.
నైతిక విలువలకు కట్టుబడి పార్టీ సిద్ధాంతాలపై నమ్మకంతో ముందుకు పోతున్న బీజేపీలో చేరాలంటే పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఈడీ, సీబీఐ సంస్థల విచారణకు, బీజేపీకి సంబంధమేలేదని, మోదీ ప్రభుత్వం అవినీతి పరులను ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈడీ కేసులున్న వాళ్లు, ఈడీ, సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న నేతలు బీజేపీలోకి వచ్చే అవకాశాలు లేవని తెలిపారు.
ఎంపీ కేశవరావుతో రాజీనామా చేయించిన కాంగ్రెస్ నేతలు ఆ పార్టీలో చేరిన ఇతర పార్టీల ఎమ్మెల్యేలతో ఎందుకు రాజీనామా చేయించలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలన నిజంగా బాగుంటే పార్టీ ఫిరాయించే ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ప్రజాతీర్పు కోరాలని సవాల్ చేశారు. ఒకవేళ ఉపఎన్నికలు జరిగితే కచ్చితంగా అన్ని స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని స్పష్టం చేశారు.
రాష్ట్ర విభజన చట్టంలోని పలు అంశాలకు పరిష్కారం లభించే అవకాశాలు ఉన్నా రాజకీయ లబ్ది కోసం గత కేసీఆర్ ప్రభుత్వం జఠిలం చేసి సమస్యను నాన్చుతూ వచ్చారని సంజయ్ విమర్శించారు. ఇప్పుడు ఆ అవసరం లేదని, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సఖ్యతతో ఉన్నారని తెలిపారు. చిత్తశుద్ధితో వ్యవహరిస్తే విభజన సమస్యల పరిష్కారం లభించే అవకాశముందని పేర్కొన్నారు.
ఇప్పటికే కేసీఆర్ గోతికాడ నక్కలా ఈ భేటీని అడ్డం పెట్టుకుని మళ్లీ ప్రజలను ఎట్లా రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆ అవకాశం ఇవ్వొద్దని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరుతున్నానని చెప్పారు. సీఎంలు చర్చించుకున్న విషయాలు తమ దృష్టికి వచ్చినప్పుడు రెండు రాష్ట్రాలకు సానుకూలంగా కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.
కాగా, రైల్వే సౌకర్యం పెద్దగా లేని కరీంనగర్ జిల్లాకు కొత్తగా కరీంనగర్ హసన్ పర్తి రైల్వే లైన్ కు గ్రీన్ సిగ్నల్ లభించిందని సంజయ్ తెలిపారు. ఇప్పటికే సర్వే కూడా పూర్తి అయిందని,ఈ బడ్జెట్లో నిధుల కేటాయింపు జరగకపోయినా వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయించి పనులు ప్రధాన మంత్రి చేతుల మీదుగా ప్రారంభిస్తామని తెలిపారు. కరీంనగర్ హసన్ పర్తి లైన్ పూర్తయితే దిల్లీకి వెళ్లే ప్రతి రైలు కరీంనగర్ మీదుగా వెళ్లే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. తద్వారా రవాణా సౌకర్యం మెరుగుపడడంతో పాటు ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా రైల్వేకు ఆదాయం మార్గంగా మారుతుందని తెలిపారు.
More Stories
టీటీడీ పరకామణిలో ఫారిన్ కరెన్సీ దోపిడీపై సీఐడీ దర్యాప్తు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏబీవీపీ ఘనవిజయం
‘మోహన్లాల్’కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు