ఈ క్రమంలో స్పీకర్ ఓం బిర్లా రాహుల్‌పై చర్యలు చేపట్టారు. రాహుల్ ప్రసంగంలోని కొన్ని వ్యాఖ్యలను పార్లమెంట్ రికార్డుల నుంచి తొలగించారు. ఈ మేరకు లోక్‌సభ సెక్రటేరియట్ తాజాగా వెల్లడించింది. స్పీకర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. హిందువులు, ప్రధాని మోదీ, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్, అగ్నివీర్, నీట్ పరీక్షల్లో అక్రమాలపై రాహుల్ చేసిన వ్యాఖ్యలను తొలగించినట్లు వివరించింది.
కాగా, తన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించడంపై రాహుల్ గాంధీ విస్మయం వ్యక్తం చేశారు. తన ప్రసంగం నుంచి తొలగించిన భాగాలు, వ్యాఖ్యలకు సంబంధించి లోక్‌సభలో విపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. తన ప్రసంగంలో తొలగించిన వ్యాఖ్యలను పునరుద్ధరించాలని స్పీకర్‌కు రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు. తన ప్రసంగంలోని కొన్ని వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించిన తీరు తనకు దిగ్భ్రాంతి కలిగించిందని, ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి విరుద్ధమని లేఖలో రాహుల్ పేర్కొన్నారు.
మరోవంక, రాహుల్ గాంధీ పార్లమెంట్ వేదికగా తప్పుడు సమాచారం అందించారని బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ మండిపడ్డారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం, ప్రజలను తప్పుదారి పట్టించేందుకు పార్లమెంట్ వేదిక కారాదని స్పష్టం చేశారు. లోక్‌సభలో నిన్న రాహుల్ అసత్యాలు వల్లెవేశారని, ఆ సమయంలో సంబంధిత మంత్రులు ఆ విషయం బయటపెట్టారని మనోజ్ తివారీ పేర్కొన్నారు. సభా వేదికపై అసత్యాలు మాట్లాడితే వాటిని రికార్డుల నుంచి తొలగించడం సభా సంప్రదాయాల్లో భాగమని మనోజ్ తివారీ స్పష్టం చేశారు.
ఇలా ఉండగా, రాహుల్ గాంధీ ప్రసంగ భాగాలను, కొన్ని వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించడం విచారకరమని శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ఆందోళన వ్యక్తం చేశారు. రాహుల్ ఏం తప్పుగా మాట్లాడారో చెప్పాలని ఆయన నిలదీశారు. పార్లమెంట్‌లో శివుడి ఫొటోను చూపేందుకు రాహుల్‌ను అనుమతించలేదని, ఇదేనా హిందూత్వ అంటే అని ప్రశ్నించారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ర్యాలీల్లో బహిరంగంగా జై శ్రీరాం అని అన్నారని, అయితే బీజేపీయేతర సభ్యులు ఒకరు సభలో ఇలా నినదిస్తే అది నేరమవుతుందా? అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ నిన్నటి ప్రసంగంలో ఎక్కడా హిందువులను అవమానించలేదని, బీజేపీ అంటే హిందూత్వ కాదని రాహుల్ విస్పష్టంగా చెప్పారని గుర్తుచేశారు.
More Stories
ప్రొటోకాల్ ఉల్లంఘనలపై బీజేపీ ఎమ్మెల్యేల నిరసన
చెన్నమనేని జర్మనీ పౌరుడే…తేల్చిచెప్పిన హైకోర్టు
చైనా జలవిద్యుత్ డ్యామ్ లతో 12 లక్షల మంది టిబెటన్ల నిరాశ్రయం