సభ ప్రారంభం కాగానే లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సభలో నీట్ అవకతవకల అంశాన్ని ప్రస్తావించారు. ఈ అంశంపై చర్చ జరపాలని పట్టుబట్టారు. ఈ విషయంపై తాము వాయిదా తీర్మానం కూడా ఇచ్చినట్లు పేర్కొన్నారు.
సభలో రాహుల్ మాట్లాడుతూ.. ‘మేము నీట్‌పై ఒక రోజు మొత్తం చర్చను కోరుతున్నాము. ఇది చాలా ముఖ్యమైన అంశం. రెండు కోట్ల మందికిపైగా విద్యార్థులు ప్రభావితులయ్యారు. 70 సందర్భాల్లో పేపర్‌లీక్‌లు జరిగాయి. ఈ విషయంలో విద్యార్థులంతా ఆందోళనలో ఉన్నారు. వారికి పార్లమెంట్ నుంచి భరోసా కల్పిస్తూ సందేశాన్ని ఇవ్వాల్సి ఉంది. మీరు ఈ అంశంపై ప్రత్యేక చర్చకు అనుమతిస్తే మేం సంతోషిస్తాం’ అని రాహుల్ గాంధీ కోరారు.
అయితే రాహుల్ అభ్యర్థనను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా వ్యతిరేకించారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే సమయంలో వాయిదా తీర్మానాలు తీసుకునేందుకు నిబంధనలు అంగీకరించవని వెల్లడించారు. ప్రస్తుత సమావేశాల్లో జీరో అవర్, ప్రశ్నోత్తరాలు లేవని తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై చర్చిద్దామని పేర్కొన్నారు.
తీర్మానాన్ని ఆమోదించిన తర్వాత ఇతర అంశాలను లేవనెత్తవచ్చని విపక్షాల అభ్యర్థనను ఓంబిర్లా తిరస్కరించారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని సభ ముగించే వరకూ ప్రత్యేక చర్చ జరగదని చెప్పారు. దీంతో సభ నుంచి విపక్షాలు వాకౌట్ చేశారు.
More Stories
బంగ్లా హిందువుల రక్షణకై భారత్ నిర్దిష్ట చర్యలు అవసరం
బంగ్లాదేశ్ లో మైనారిటీలపై హింస, అణచివేతలపై నిరసన
లింగాయత్‌ల కోటా పోరుపై పోలీసుల లాఠీచార్జి