శ్రీలంకలో ఆన్‌లైన్ మోసాలకు 60 మంది భారతీయుల అరెస్టు

శ్రీలంకలో ఆన్‌లైన్ మోసాలకు 60 మంది భారతీయుల అరెస్టు

ఆన్‌లైన్ ఆర్థిక కుంభకోణాలకు పాల్పడుతున్న ముఠాలో సభ్యులైన 60 మంది భారతీయులను శ్రీలంకకు చెందిన క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ డిపార్ట్‌మెంట్(సిఐడి) అరెస్టు చేసింది. శ్రీలంక రాజధాని కొలంబో నగర శివార్లలోని మడివేలా, పట్టరముల్లాతోపాటు పశ్చిమ కోస్తా పట్టణం నెగొంబో నుంచి వీరిని గురువారం అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు అధికార ప్రతినిధి ఎస్‌ఎస్‌పి నిహాల్ తల్‌దువా శుక్రవారం తెలిపారు.

ఈ ప్రాంతాలలో ఏకకాలంలో దాడులు జరిపిన సిఐడి అధికారులు ముఠా సభ్యులను అరెస్టు చేయడంతోపాటు వారి నుంచి 135 మొబైల్ ఫోన్లను, 57 లాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. సోషల్ మీడియా చాటింగ్‌ల కోసం డబ్బు ముట్టచెబుతామని వాగ్దానం చేసి వాట్సాప్ గ్రూపులో చేరేందుకు ప్రలోభపెట్టి తనను మోసం చేశారని ఒక బాధితుడు చేసిన ఫిర్యాదు మేరకు సిఐడి అధికారులు ఈ దాడులు జరిపారు.

నొగొంబోలోని ఒక విలాసవంతమైన భవనంపై జరిపిన దాడిలో కీలక ఆధారాలు లభించడంతోపాటు 13 మంది అనుమానితుల అరెస్టు చేసినట్లు ఆయన చెప్పారు. వారి నుంచి 57 మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నామని ఆయన తెలిపారు.

నొగొంబోలో జరిపిన దాడి తదుపరి మరో 19 మందిని అరెస్టు చేశారు. ఈ ముఠాకు దుబాయ్, అఫ్ఘానిస్తాన్‌లో అంతర్జాతీయ సంబంధాలు ఉన్నట్లు తెలిసింది. బాధితులలో స్థానకులతోపాటు విదేశీయులు కూడా ఉన్నారు. ఆర్థిక మోసాలు, చట్టవిరుద్ధ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ వంటి వివిధ నేరాలకు ఈ ముఠా పల్పాడినట్లు సిఐడి అనుమానిస్తోంది.