దేశంలో నీట్ సమస్య అత్యంత ముఖ్యమైందని, అన్నింటికంటే ముందు దీనిపైనే పార్లమెంట్‌లో చర్చ జరగాలని రాహుల్ అన్నారు. నీట్‌పై ప్రత్యేక చర్చ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అందుకు స్పీకర్ ఓం బిర్లా అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం చేపట్టడానికి ముందు ఎటువంటి వాయిదా తీర్మానాలను స్వీకరించరని తెలిపారు. కానీ విపక్ష ఎంపీలు మాత్రం తమ పట్టువీడలేదు.
నీట్‌పై చర్చ చేపట్టాలంటూ నినాదాలు చేయడంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో సభను 12 గంటల వరకు స్పీకర్ వాయిదా వేశారు. ఆ తర్వాత తిరిగి సభ ప్రారంభమైనప్పటికీ ఎలాంటి మార్పూ లేదు. ప్రతిపక్షాల నిరసనల నేపథ్యంలో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓంబిర్లా ప్రకటించారు.
మరోవైపు ఎగువ సభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. రాజ్యసభలో నీట్ అంశంపై చర్చకు విపక్షాలు పట్టుబడుతూ నినాదాలు చేశారు. పేపర్ లీకేజీపై ఖర్గే ఆరోపణలు చేశారు. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది. ఈ నేపథ్యంలో చైర్మెన్ జగదీప్ ధన్‌కర్ సభను 12 గంటల వరకు వాయిదా వేశారు. ఆ తర్వాత సభ ప్రారంభమైనప్పటికీ విపక్ష సభ్యులు ఆందోళన కొనసాగించాయి. అయినప్పటికీ చైర్మన్ ధన్‌కర్ సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చను చేపట్టారు. సభ్యులు ఆందోళన కొనసాగిస్తుండటంతో సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.
విపక్షాలు ఏ అంశం లేవనెత్తినా సమగ్ర సమాచారం ఇస్తామని తాము స్పష్టంగా చెప్పినా విపక్షాలు సభా కార్యకలాపాలకు అడ్డుపడటం విచారకరమని పార్లమెంటరీ వ్యవహరాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ప్రభుత్వం చర్చకు సిద్ధమని తాము సభ్యులకు మరోసారి హామీ ఇస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం పదేపదే చెప్పినా సభా కార్యకలపాలకు కాంగ్రెస్ సభ్యులు అడ్డుపడుతూ సభను సజావుగా జరగనివ్వకపోవడం సరైంది కాదని, దీన్ని తాను ఖండిస్తున్నానని కిరణ్ రిజిజు పేర్కొన్నారు. సభా కార్యకలాపాలకు అడ్డుతగలవద్దని ఆయా సభ్యులకు తాను విజ్ఞప్తి చేస్తున్నానని మంత్రి చెప్పారు.
More Stories
బంగ్లా హిందువుల రక్షణకై భారత్ నిర్దిష్ట చర్యలు అవసరం
బంగ్లాదేశ్ లో మైనారిటీలపై హింస, అణచివేతలపై నిరసన
ఈ సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లు