తెలంగాణ వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు సోమవారం నుండి నిరవధిక సమ్మె చేస్తున్నారు. ఎమర్జెన్సీ సేవలు మినహా మిగతా అన్ని రకాల విధులను బహిష్కరించారు. దీంతో ఓపీ సేవలు, ఎలక్టివ్ సర్జరీలు, వార్డ్ డ్యూటీలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలోనే వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహతో జూనియర్ డాక్టర్లు సోమవారం మధ్యాహ్నం చర్చలు నిర్వహించారు.
అయితే, ఈ చర్చలు అంసపూర్తిగా ముగిశాయని జూడాలు పేర్కొన్నారు. కొన్ని ప్రతిపాదనలపై మంత్రి సానుకూలంగా స్పందించారని, మరికొన్ని ప్రతిపాదనలపై మరోసారి చర్చించాలని నిర్ణయించినట్లు తెలిపారు. డాక్టర్ల భద్రత గురించి ఆలోచిస్తామని, స్టైఫండ్‌కు గ్రీన్ ఛానల్‌పై మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుంటామని వైద్యారోగ్య శాఖ మంత్రి చెప్పినట్లు జూనియర్ డాక్టర్లు పేర్కొన్నారు.
సమ్మె కొనసాగింపుపై రాష్ట్ర స్థాయి జూడాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని, అప్పటి వరకు సమ్మె యథాతథంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. గ్రీన్ చానెల్ ఏర్పాటు చేసి ప్రతి నెలా స్టైఫండ్ చెల్లింపు, సూపర్ స్పెషాలిటీ సీనియర్ రెసిడెంట్‌లకు రూ. 1.25 లక్షల గౌరవ వేతనం, మెడికల్ కాలేజీల్లో పెంచిన 15 శాతం సీట్లలో ఏపీ విద్యార్థులకు అవకాశం ఇవ్వకూడదని, డాక్టర్లపై దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలనే పలు డిమాండ్లతో జూనియర్ డాక్టర్లు సమ్మె చేస్తున్నారు.
తమ డిమాండ్లు పరిష్కారమయ్యేంత వరకు తగ్గేది లేదని జూనియర్ డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. దాదాపు 4 వేల మంది సమ్మెలో పాల్గొంటున్నామని తెలిపారు. స్టయిఫండ్ చెల్లింపులతోపాటు 8 డిమాండ్లు పరిష్కరించాలని ఈ నెల 19న ప్రభుత్వానికి సమ్మె నోటీసులు ఇచ్చారు. నాలుగు రోజులుగా నిరసన తెలుపుతున్నప్పటికీ వైద్యశాఖ మంత్రి కానీ, ప్రభుత్వం కానీ పట్టించుకోలేదని జూడాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిరవధిక సమ్మెకు దిగామని చెప్పారు.
గత నెల 20న కూడా ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చారు. 21న ఉన్నతాధికారులు చర్చలు జరిపి హామీ ఇవ్వటంతో సమ్మె విరమించారు. నెల గడుస్తున్నా ఒక్క హామీ కూడా నెరవేర్చకపోవటంతో ఈ నెల 19న మరోసారి సమ్మె నోటీసు ఇచ్చారు. మరుసటి రోజు నుంచి తమ నిరసనను వివిధ రూపాల్లో తెలియజేశారు.
నల్ల రిబ్బన్లు, డ్రెస్ వేసుకొని విధులకు హాజరుకావటం వంటివి చేపట్టారు. ఆదివారం కండ్లకు నల్లగంతలు కట్టుకొని నిరసన తెలిపారు. అయినా ఉన్నతాధికారులు స్పందించలేదు. వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా పట్టించుకోలేదు. దీంతో తాము నిరవధిక సమ్మెకు వెళ్తున్నట్టు స్పష్టం చేశారు.
More Stories
బాంగ్లాలో హిందువులపై మారణకాండ పట్ల భారత్ చర్యలు చేపట్టాలి
తెలుగు రాష్ట్రాల్లో కొండెక్కిన గుడ్ల ధర
పోలీసులు క్షమాపణలు చెప్పాల్సిందే.. ఆశా వర్కర్లు