`నీట్’లో అక్రమాలపై సిబిఐ దర్యాప్తు కోరిన ఎబివిపి

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) నిర్వహణలో జరిగిన అవకతవకలపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)తో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు వినతిపత్రం సమర్పించింది. రికార్డు స్థాయిలో 67 మంది విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించడం, వీరిలో కొందరు హర్యానాలోని అదే పరీక్షా కేంద్రం నుండి ఉండడంతో కలకలం చెలరేగింది. 
 
4750 కేంద్రాలలో జరిగిన ఈ పరీక్షలలో 24 లక్షల మంది విద్యార్థులు పాల్గొన్నారు. అయితే పేపర్ లీక్ ఆరోపణలు రావడం, ప్రశ్నార్థకంగా గ్రేస్ మార్కులు ప్రకటించడంతో పెను దుమారం చెలరేగింది.  ఈ నేపథ్యంలో ఏబీవీపీ జాతీయ కార్యదర్శి వీరేంద్ర సోలంకి నేతృత్వంలోని ఏబీవీపీ ప్రతినిధి బృందం త్వరితగతిన విచారణ జరిపి అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రిని కోరింది. దేశవ్యాప్తంగా వివిధ పరీక్షా కేంద్రాల్లో సాల్వర్ల ప్రమేయం, ప్రశ్నపత్రాల పంపిణీ వంటి అంశాలను ఎబివిపి తన వినతిపత్రంలో ప్రస్తావించింది.
 
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) పరీక్షా కేంద్రాలను సరిగ్గా సమీక్షించి సిద్ధం చేయడంలో విఫలమై అక్రమాలకు దారితీసిందని ప్రతినిధి బృందం ఆరోపించింది. ఎబివిపి జాతీయ కార్యదర్శులు వీరేంద్ర సోలంకి, శివంగి ఖర్వాల్ మాట్లాడుతూ, “నీట్ పరీక్షా ప్రక్రియ, ఫలితాల్లో అవకతవకలపై విద్యార్థులలో సందేహం ఉంది. ఎబివిపి వారి డిమాండ్లకు మద్దతు ఇస్తుంది.  ఈ విషయంపై సిబిఐ విచారణకు పిలుపునిస్తుంది” అని తెలిపారు.
 
ఎన్టీయే వంటి టెస్టింగ్ ఏజెన్సీ అసమర్థతను ఈ పక్రియ వెల్లడి చేస్తుందని పేర్కొంటూ భవిష్యత్ సమస్యలను నివారించడానికి దాని పనితీరును సమర్ధవంతంగా మార్చాలని డిమాండ్ చేశారు.  ఏబీవీపీ మెడివిజన్ నేషనల్ కోఆర్డినేటర్ అభినందన్ బొకారియా మాట్లాడుతూ ఇలాంటి అవకతవకలను అరికట్టేందుకు పరీక్షా సంస్థ పరీక్షకు ముందే సమీక్ష నిర్వహించి ఉండాల్సిందని చెప్పారు. 
 
వైద్యరంగంలో ప్రవేశించాలనుకునే విద్యార్థులకు నీట్ కీలకమైన పరీక్ష అని, ఇలాంటి పెద్ద వైరుధ్యాలు వారికి ద్రోహం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. ఈ సంఘటనకు బాధ్యులైన వారిపై సాధ్యమైనంత కఠిన చర్యలు తీసుకోవాలని ఎబివిపి డిమాండ్ చేసిందిద. విద్యాశాఖ మంత్రి వినతిపత్రం స్వీకరిస్తూ బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
 
కాగా, ప్రజలు ప్రశ్నలు అడిగినప్పుడు ప్రభుత్వం కచ్చితంగా జవాబు చెప్పాల్సిందేనని ఏబీవీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి యజ్ఞల్క్య శుక్ల ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. ‘ఎన్‌టీఏలో నిర్వహణలోపం ఉందనే అభిప్రాయం ఉంది. పలు పరీక్ష కేంద్రాలకు ప్రశ్నాపత్రాలు 15- 20 నిమిషాలు ఆలస్యంగా ఎలా వెళ్తాయి? ఒకే కేంద్రానికి చెందిన 7-8 మంది విద్యార్థులకు 100 శాతం మార్కులు ఎలా వస్తాయి? 67 మంది విద్యార్థులకు 720కి 720 మార్కులు ఎలా వస్తాయి? ఎన్‌టీఏ విశ్వసనీయత ప్రశ్నార్ధకంగా మారింది. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐతో విచారణ జరపాలి’ అని ఆయన డిమాండ్ చేశారు.