సింగరేణి అవినీతి, అక్రమాలపై సీబీఐ విచారణ కోరే దమ్ముందా?

సింగరేణి అవినీతి, అక్రమాలపై సీబీఐ విచారణ కోరే దమ్ముందా?

రాష్ట్ర ప్రభుత్వానికి సింగరేణిలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై సీబీఐ విచారణ కోరే దమ్ముందా? అంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్​ కుమార్​ సవాల్​ విసిరారు. సీబీఐ విచారణ జరిపితే గత ప్రభుత్వ నిర్వాహకంతో పాటు సింగరేణి దుస్థితికి కారకులెవరో తేలిపోతుందని తెలిపారు. సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని సాక్షాత్తు ప్రధానమంత్రి మోదీ ప్రకటించిన తర్వాత కూడా కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ పార్టీలు మళ్లీ తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల్లో అయోమయం సృష్టిస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు. 

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్​లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో ఆయన పాల్గొంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం లేకుండా కేంద్ర ప్రభుత్వం సింగరేణిని ప్రైవేటీకరణ చేయడం అసాధ్యమని స్పష్టం చేశారు. సింగరేణిలో కేంద్రానిది 49 శాతం వాటా మాత్రమేనని, రాష్ట్రానిది 51 శాతం వాటా ఉందని గుర్తు చేశారు.

సింగరేణి ఈదుస్థితికి రావడానికి కారణం నాటి సీఎం కేసీఆర్​నే అని ఆరోపించారు. తాడిచర్లలో ఏపీ జెన్​కో ఇస్తే కేసీఆర్​ ప్రభుత్వం ప్రైవేటు వాళ్లకు అప్పగించింది నిజం కాదా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. సింగరేణిని పూర్తిగా ప్రైవేటీకరించిందే కేసీఆర్​. ఆయన మూర్ఖత్వపు ఆలోచనల వల్ల సింగరేణిని పూర్తిగా దెబ్బతీశారని సంజయ్​ దుయ్యబట్టారు. 

తన కుటుంబానికి ఏటీఎంలా మార్చుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు కాంగ్రెస్​ కూడా కేసీఆర్​ కుటుంబం మాదిరి అదే బాటలో నడుస్తోందని ఆరోపణలు చేశారు. కేసీఆర్​ సర్కార్​ గతంలో నయీం కేసు, మియాపూర్​ భూములు, డ్రగ్స్​, పేపర్​ లీకేజీ వంటి వాటిపై సిట్​ వేసి మధ్యలోనే నీరు గార్చారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్​ కూడా అంతే ఫోన్​ ట్యాపింగ్​, కాళేశ్వరం విచారణ పేరుతో జాప్యం చేస్తూ లాభం పొందాలనుకుంటున్నారే తప్ప వేరే ఆలోచనలే లేదని ఆరోపించారు.