ఎలాన్ మస్క్ కు బీజేపీ ఎంపీ పురందేశ్వరి సవాల్!

అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల వినియోగంపైన బిలియనీర్, ప్రముఖ వ్యాపారవేత్త, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టిన ఎలాన్ మస్క్ ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంలను తొలగించడంతో హ్యాకింగ్ ను నివారించవచ్చు అంటూ పేర్కొన్నారు.
 
అమెరికాలోని ప్యూర్టో రికోలో ఇటీవల నిర్వహించిన ప్రైమరీ ఎన్నికల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయి అన్న ఆరోపణలపై ఎక్స్ వేదికగా మస్క్ స్పందించారు. ఈవీఎంలను వ్యక్తులు లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో హ్యాక్ చేసే ప్రమాదం ఉందని, ఇది దేశానికి నష్టాన్ని కలిగిస్తుందని మస్క్ హెచ్చరించారు. 
 
ఇక దీంతో మస్క్ చేసిన వ్యాఖ్యలపైన భారతదేశంలో దుమారం రేగింది. ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పెద్ద యుద్ధమే మొదలైంది. మస్క్ చేసిన వ్యాఖ్యల పైన బిజెపి కాంగ్రెస్ నేతలు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఒకరకంగా ఇది ఈవీఎం వార్ కు కారణంగా మారింది.

ఇక ఇదే క్రమంలో తాజాగా ఎలాన్ మస్క్ ఈవీఎంల విషయంలో చేసిన వ్యాఖ్యల పైన బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి సవాల్ విసిరారు. ఈవీఎంలు హ్యాక్ చేయొచ్చన్న మస్క్ వ్యాఖ్యల పైన స్పందించిన ఆమె ఎలాన్ మస్క్ ను భారత ఎన్నికల సంఘం భారత్ కు ఆహ్వానించాలని సూచించారు. ఈవీఎంల హ్యాకింగ్ నిరూపణకు మస్క్ కు అవకాశం ఇవ్వాలని పురందేశ్వరి అభిప్రాయపడ్డారు.

ఇప్పటికే ఈవీఎంలపై పరిశోధనలకు చాలామందికి ఈసీ అవకాశం ఇచ్చిందని, మస్క్ కు కూడా ఇవ్వాలని ఆమె కోరారు. ఇప్పటివరకు ఎవరూ ఈవీఎంలను హ్యాక్ చేయలేకపోయారని పురందేశ్వరి గుర్తు చేశారు. ఎలాంటి ఈవీఎంనైనా హ్యాక్ చేయొచ్చు అన్న మస్క్ వ్యాఖ్యల నేపథ్యంలో పురందేశ్వరి, దమ్ముంటే నిరూపించాలంటూ ఎలాన్ మస్క్ కు సవాల్ విసిరారు. 
 
ఎలాన్ మస్క్ పై బీజేపీ దాడి సోషల్ మీడియా వేదికగా ఆమె చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఇక మరోవైపు మస్క్ చేసిన పోస్ట్ పై ఇప్పటికే కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కూడా తన స్పందన తెలియజేశారు. అప్పుడైతే టెస్లా కార్లను కూడా హ్యాక్ చెయ్యొచ్చు అన్నారు. ఈవీఎంల హ్యాకింగ్‌ భారత్ లో సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఈవీఎంలకు ఇంటర్‌నెట్‌ కనెక్షన్‌ గానీ, వైఫై, బ్లూటూత్‌ కనెక్షన్‌ లేదని గుర్తు చేశారు.