తన ఓటమిని ఈవీఎంలపై నెట్టే జగన్ ప్రయత్నం!

తన ఓటమిని ఈవీఎంలపై నెట్టే జగన్ ప్రయత్నం!
ఎన్నికల్లో ఘోర పరాజయం పాలవడాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్​  మోహన్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నట్లు కనిపిస్తున్నది. ఎన్నికల ఫలితాలు రాగానే తన నగదు బదిలీ పధకాల ద్వారా లబ్ది పొందిన ఓటర్లు తనను మోసం చేశారని అన్నట్లు మాట్లాడారు. ఇప్పుడేమో తాజాగా ఈవీఎంలపై నెపం నెట్టివేసి ప్రయత్నం చేస్తున్నారు.
 
ఎన్నికల్లో ఓటమిపై అదేరోజు మీడియాతో మాట్లాడిన జగన్​ తమను జనం నమ్మలేదని, పథకాలు తీసుకుని వమ్ముచేశారని వారిపై నెపం నెట్టే ప్రయత్నం చేశారు. తాజాగా ఈవీఎం యంత్రాలపైనా ఎక్స్ వేదికగా అసహనం వ్యక్తం చేటు పేపర్ బ్యాలట్ ను తిరిగి ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు. 
 
“న్యాయం అందడమే కాదు.. అందజేసినట్లు కూడా కనిపించాలి, ప్రజాస్వామ్యం కూడా నిస్సందేహంగా బలంగా ఉన్నట్లు కనిపించాలి. పేపర్ బ్యాలెట్​ ఓటు పారదర్శకతను పెంచుతుంది. ప్రజల్లో విశ్వాసం నింపుతుంది. అభివృద్ధి చెందిన అనేక దేశాల్లో బ్యాలెట్​ పేపర్​ వినియోగిస్తున్నారు. ఎన్నికల్లో ఈవీఎంలు కాకుండా పేపర్ బ్యాలెట్‌ వాడకం ప్రజాస్వామ్యం నిజమైన స్ఫూర్తిని చాటుతుంది, పౌరుల నమ్మకాన్ని మరింత బలోపేతం చేస్తుంది” అని పేర్కొన్నారు.

ఇదే జగన్​ అంతకుముందు 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఈవీఎంలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు మరోవిధంగా ఉన్నాయి. “80 శాతం ఓటర్లు పోలింగ్ బూత్​లో బటన్ నొక్కారు. వాళ్లు ఎవరికి ఓటు వేశారో వీవీ ప్యాట్​లో కూడా కనిపించింది. రెండూ మ్యాచ్​ అయ్యాయి కాబట్టే ఓటు వేసిన వాళ్లంతా సంతృప్తి చెందారు.  80శాతం ఓటర్లలో ఏ ఒక్క ఓటరూ ఫిర్యాదు ఇవ్వలేదు” అని పేర్కొన్నారు. 

పైగా, “నేను ఫ్యాన్​ గుర్తుకు ఓటేసి వీవీ ప్యాట్​లో సైకిల్​ గుర్తు కనిపిస్తే నేనెందుకు గమ్మునుంటా? గమ్మునుండను కదా! అక్కడే బూత్​లోనే గొడవ చేసి ఉండేవాడిని. ఫిర్యాదు ఇచ్చే వాడిని. ఏ పార్టీ వాడైనా ఓటేసిన తర్వాత వేరే పార్టీకి పడుతున్నట్లుగా ఎవరికీ కనిపించలేదు కాబట్టే 80 శాతం మంది జనాభా ప్రతి ఒక్కరూ సంతృప్తి చెందారు. ఎటువంటివి ఎక్కడా జరగలేదు” అంటూ ఈవీఎంలపై భరోసా వ్యక్తం చేశారు.

జగన్​ ట్వీట్​పై టీడీపీ నేతలు తమదైన శైలిలో చురకలు అంటిస్తున్నారు.” జగన్‌కు 151 సీట్లు వచ్చినప్పుడు అది మీ విజయమా? మాకు 164 సీట్లు వస్తే ఈవీఎంల గురించి మాట్లాడతారా?” అని బుద్ధా వెంకన్న ప్రశ్నించారు. జగన్ పులివెందుల ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేసి ఉప ఎన్నికకు వస్తే బ్యాలెట్ పేపర్ విధానంలో ఉపఎన్నిక పెట్టాలని అందరం ఈసీని కోరదాం అని బుద్ధా ఎద్దేవా చేశారు. జగన్ ఇంకా షాక్ నుంచి తేరుకోలేదని, ఆత్మ స్తుతి పర నింద మాని ఇకనైనా ఆత్మవిమర్శ చేసుకోవాలని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్​ రెడ్డి హితవు పలికారు.