ఢిల్లీలో నీటి సంక్షోభంపై బిజెపి నిరసనలు

దేశ రాజధానిలో నెలకొన్న నీటి సంక్షోభంపై ఆదివారం నాడు ఢిల్లీ అంతటా భారతీయ జనతా పార్టీ (బిజెపి) నిరసనలు చేపట్టింది. పశ్చిమ ఢిల్లీకి చెందిన బీజేపీ ఎంపీ కమల్‌జీత్ సెహ్రావత్, ఇతర పార్టీ కార్యకర్తలు ఢిల్లీలోని నజఫ్‌గఢ్‌లో ‘మట్కా ఫోడ్’ (మట్టి కుండలు పగలగొట్టడం) నిరసనను నిర్వహించారు. సెహ్రావత్ ద్వారకలోని నీటి పైప్‌లైన్‌ను కూడా పరిశీలించారు. 
 
ఆప్ ప్రభుత్వం ఇతర రాష్ట్ర ప్రభుత్వాలను నిందించడంలో బిజీగా ఉండగా, తాను పరిశీలించిన పైపులు పగిలిపోయి చాలా నీరు వృథా అవుతోందని ఆమె విమర్శించారు. ద్వారకా ఆర్‌డబ్ల్యూఏల నుంచి మాకు కాల్స్ వస్తున్నాయని, నీటి కొరతపై ఫిర్యాదులు రావడంతో వారు తమను కలవడానికి వస్తున్నారని, ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ల వల్ల ప్రభుత్వ ట్యాంకర్లను వినియోగించుకోలేకపోతున్నామని కమల్‌జీత్ సెహ్రావత్ మీడియాతో పేర్కొన్నారు.
 
“ఈరోజు నేను పరిశీలించిన పైపులు పగిలి చాలా నీరు వృథా అవుతోంది. ఢిల్లీ ప్రభుత్వం నీటి కొరతకు ఇతర రాష్ట్ర ప్రభుత్వాలను నిందిస్తోంది. అయితే సమస్య వారి శాఖలోనే ఉంది. మానవతా దృక్పథంతో కాదు, మంత్రిగా నేను అతిషిని అభ్యర్థిస్తున్నాను. ఢిల్లీ ప్రభుత్వం, ఆమె తన డిపార్ట్‌మెంట్‌ను జాగ్రత్తగా చూసుకోవాలి” అని ఆమె కోరారు. 
 
అదే సమయంలో, ఆర్‌కె పురంలోని సెక్టార్ 7 వద్ద ఢిల్లీ జల్ బోర్డ్ కార్యాలయం వద్ద న్యూఢిల్లీకి చెందిన బిజెపి ఎంపి బన్సూరి స్వరాజ్ ఢిల్లీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. నీటి పరిమాణం, హర్యానా ఒప్పందం కంటే ఎక్కువ నీటిని విడుదల చేస్తోందని స్వరాజ్ చెప్పారు. “అయితే, ఆప్ ప్రభుత్వం ఒక దశాబ్ద కాలం పాలనలో ఢిల్లీ జల్ బోర్డ్‌ను రూ. 7,300 కోట్ల నష్టానికి తీసుకువచ్చిందని ఆమె మండిపడ్డారు. 
 
 ఇది 2013లో రూ. 600 కోట్ల లాభాన్ని పొందిందని ఆమె గుర్తు చేసారు. వారు ఢిల్లీ జల్ బోర్డ్ మౌలిక సదుపాయాలలో ఎటువంటి మరమ్మతులు చేయలేదని,  40 శాతం నీరు వృధా అవుతుందని పేర్కొంటూ ఆప్ ప్రభుత్వ మద్దతుతో అక్రమ ట్యాంకర్ మాఫియాలు నీటిని దొంగిలిస్తున్నారని ఆమె ఆరోపించారు. 
 
నిరసనలో పాల్గొన్న ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా మాట్లాడుతూ ‘ఢిల్లీలో నీటి కొరతకు ఎవరైనా బాధ్యులైతే అది సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఆప్ ప్రభుత్వమే. ఢిల్లీలో నీటి కొరత సహజం కాదు. ఢిల్లీలో నీరు అవసరం. నీటి చౌర్యం కారణంగా హర్యానా ఒప్పందం కంటే ఎక్కువ పరిమాణంలో నీటిని ఇస్తున్నా వృద్దా కారణంగా నీటి కొరత ఏర్పడుతుంది’ అని తెలిపారు. 
 
మరోవైపు నీటి చౌర్యాన్ని అరికట్టేందుకు పోలీసుల గస్తీని కోరుతూ ఆప్ నేత, జలవనరుల శాఖ మంత్రి అతిషి ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరాకు లేఖ రాశారు. ట్యాంకర్ మాఫియా, లీకేజీల ద్వారా దొంగతనాలను “మెలోడ్రామాలో మునిగి తేలడం” కాకుండా సరిచేయాలని కోరుతూ బిజెపి ప్రభుత్వంపై ఆమె విరుచుకు పడ్డారు. ప్రధాన పైప్‌లైన్ల వద్ద 15 రోజులపాటు పోలీస్‌ భద్రత ఏర్పాటుచేయాలని పోలీస్‌ కమిషనర్‌కు రాసిన లేఖలో విజ్ఞప్తి చేసింది. ఢిల్లీ ప్రజలకు వ్యతిరేకంగా బీజేపీ కుట్రకు పాల్పడుతుందని అతిశీ ఆరోపించారు.
కాగా, బీజేపీ చేపట్టిన నిరసనలు ఉద్రిక్తతను రేపాయి. ఢిల్లీ జల్‌ బోర్డ్‌(డీజేబీ) కార్యాలయంలో కొంతమంది ఆందోళనకారులు కార్యాలయం అద్దాల్ని, ఫర్నిచర్‌ను, మట్టి కుండల్ని పగలగొట్టి విధ్వంసం సృష్టించారు. కార్యాలయంపై దాడికి దిగింది బీజేపీ నాయకులు, కార్యకర్తలేనంటూ ఆప్‌ మంత్రి సౌరభ్‌ భరద్వాజ్‌ ఆరోపించారు.