తిరిగి ప్రతి సోమవారం పోలవరం కోసం చంద్రబాబు

అధికారం చేపట్టగానే రాష్ట్రంలోని నీటిపారుద‌ల ప్రాజెక్టుల‌పై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు దృష్టి పెట్టారు. ముఖ్య‌మంత్రి బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత మొద‌టి స‌మీక్ష కూడా ప్రాజెక్టుల‌పైనే నిర్వ‌హించారు. రాష్ట్రంలోని ప్రాజెక్టుల నిర్మాణం, ప‌నితీరుపై పూర్తి వివ‌రాల‌తో నివేదిక‌ను వారం రోజుల్లోగా ఇవ్వాల‌ని జ‌ల‌వ‌న‌రుల శాఖ అధికారుల‌ను ఆదేశించారు.

వైసిపి హయాంలో నీటివరరులను నిర్లక్ష్యం చేయడం, ఒక్క ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయకపోవడంతో ఆయన ఈ అంశంకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తున్నది. గతంలో మాదిరిగా ఇక నుండి ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్ట్ పై దృష్టి సారిస్తానని సంకేతం ఇచ్చారు. వచ్చే సోమవారం పోలవరంకు తన పర్యటన ఏర్పాటు చేయమని అధికారులను కోరారు.

పోల‌వ‌రం ప్రాజెక్టును సోమ‌వారం సంద‌ర్శించి, నిర్మాణ ప‌నులు జరుగుతున్న తీరును ప‌రిశీలిస్తాన‌ని చంద్రబాబే స్వ‌యంగా అధికారుల‌కు తెలిపార అప్పుడు ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాథ‌మిక నివేదిక ఇచ్చిన‌ప్ప‌టికీ, పూర్తిస్థాయి నివేదిక మాత్రం వారం రోజుల్లోగా ఇవ్వాల‌ని ఆదేశించారు.  రాష్ట్రంలో పోలవ‌రం ప్రాజెక్టుతో పాటు మ‌రో 14 ప్రాజెక్టుల‌కు సంబంధించిన వివ‌రాల‌ను చంద్రబాబుకు అధికారులు అందించారు. 

 
ఈ ప్రాజెక్టుల‌న్నీ వెంట‌నే పూర్తి చేయ‌డానికి అవ‌కాశం ఉంద‌ని, అయితే అందుకు రూ 30,000 కోట్లు నిధులు అవసరమని తెలిపారు. కాగా, పోల‌వ‌రం ప్రాజెక్టులోని కీల‌క‌మైన డ‌యాఫ్రం వాల్‌పై జ‌రిగిన రాద్ధాంతంపైనా వివ‌రాలు అడిగి చంద్ర‌బాబు తెలుసుకున్నారు. డ‌యాఫ్రం వాల్‌ను కూడా ప‌రిశీలిస్తాన‌ని చెప్పారు.

ఐదేళ్ల‌లో జ‌ల‌వ‌న‌రుల శాఖ‌లో జ‌రిగిన ప‌నులు, చెల్లించిన నిధుల వివ‌రాల‌తో వెంట‌నే ఒక నివేదిక త‌యారు చేయాల‌ని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రాజెక్టుల ప్రాధాన్య‌త‌, ప్రాంతాలు, త‌క్ష‌ణ అవ‌స‌రాలు వంటి వివ‌రాల ఆధారంగా ఈ నివేదిక ఉండాల‌ని చెప్పారు. ముఖ్యంగా ఐదేళ్ల‌లో జ‌రిగిన చెల్లింపుల్లో ఎవ‌రికీ ఎన్ని నిధులు ఇచ్చారు,వారు చేసిన ప‌నులు, చేయాల్సిన ప‌నులు అనే అంశాల‌పై దృష్టి పెట్టాల‌ని సూచించారు.

జ‌ల‌వ‌న‌రుల శాఖ‌లో కొద్ది మంది అధికారులు ఇష్టం వ‌చ్చిన‌ట్లు వ్య‌వ‌హ‌రించార‌ని చెబుతూ  ఇక ముందు వారి ఆట‌లు చెల్ల‌వ‌ని హెచ్చ‌రించారు. అటువంటి అధికారుల‌పై త‌గిన స‌మ‌యంలో త‌గిన నిర్ణ‌యం తీసుకుంటామ‌ని స్పష్టం చేశారు.

రాయ‌ల‌సీమ ప్రాంతంలో తెగిపోయిన చెరువుల‌తో పాటు, కుప్పం ప్రాజెక్టుపైన కూడా మ‌రో నివేదిక ఇవ్వాల‌ని అధికారుల‌కు చంద్రబాబు సూచించారు. పెన్నా, గోదావ‌రి న‌దుల అనుసంధానం ప్రాజెక్టును దృష్టిలో ఉంచుకుని నివేదిక రూపొందించాల‌ని తెలిపారు. ఒక‌టి, రెండేళ్ల‌లో పూర్తి చేసేందుకు అవకాశం ఉన్న ప్రాజెక్టుల‌ను పూర్తి చేసి వినియోగంలోకి తీసుకువ‌చ్చేందుకు వీలైన ఏర్పాటు చేయాల‌ని సూచించారు.