వాయనాడ్‌ ఉప ఎన్నికలో ప్రియాంక పోటీ!

కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంకా గాంధీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కంచుకోటలైన అమేథి లేదా రాయ్‌బరేలీ నుంచి ఆమెకు టికెట్‌ ఇస్తారనే ప్రచారం జోరుగా జరిగింది. అయితే చివరికి ఆమె అసలు పోటీకే దూరంగా ఉన్నారు. తాజాగా ప్రియాంకా వయనాడ్‌ నుంచి బరిలోకి దిగుతారని ప్రచారం జరుగుతున్నది. 
 
సార్వత్రిక ఎన్నికల్లో ఆమె సోదరుడు రాహుల్‌ గాంధీ వయనాడ్‌, రాయ్‌బరేలీల  నుంచి భారీ మెజార్టీతో విజయం సాధించారు. అయితే ఏదో ఒక స్థానం నుంచి మాత్రమే ఆయన కొనసాగాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రాహుల్‌ తన సోదరి కోసం వయనాడ్‌ స్థానానికి రాజీనామా చేయనున్నారని, దీంతో అక్కడ జరిగే ఉపఎన్నికలో ప్రియాంక పోటీచేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
 

2019లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన ప్రియాంక అప్పుడు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వారణాసి నుంచి ప్రధాని మోదీపై పోటీచేస్తారని ప్రచారం జరిగింది. అమెకు కాంగ్రెస్‌ పార్టీ టిక్కెట్ ఇవ్వకపోవడంతో అదంతా ఒట్టి ప్రచారమేనని తేలిపోయింది. తర్వాత 2022లో జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచార బాధ్యతలను తన భుజాలపై వేసుకున్నారు. 

విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. తానే ముఖ్యమంత్రి అభ్యర్ధినంటూ పేర్కొన్నారు కూడా. కానీ, తర్వాత ఆ మాటలను వెనక్కి తీసుకున్న ఆమె  ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించారు.  రాయబరేలీ నుంచి ప్రాతినిధ్యం వహించిన సోనియా గాంధీ రాజ్యసభ నామినేట్ కావడంతో ఆ స్థానంలో ప్రియాంక గాంధీ పోటీ దాదాపు ఖరారయ్యిందనే ప్రచారం జోరుగా సాగింది. రాయబరేలీ నుంచి ప్రియాంక, అమేథీ నుంచి రాహుల్ గాంధీ బరిలో నిలుస్తారని మీడియా కథనాలు వెలువడ్డాయి. 

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నిర్ణయం తీసుకోవాలని తోబుట్టువులను కోరారని, ఇద్దరూ పోటీ చేయాలని ఆయన కోరుకుంటున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కానీ అక్కడ రాహుల్‌ పోటీచేసి విజయం సాధించారు. అయితే కేరళలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాహుల్‌ వయనాడ్‌ను అట్టిపెట్టుకుని రాయ్‌బరేలి స్థానానికి రాజీనామా చేస్తారనే ప్రచారమూ జరిగింది. అయితే ఇప్పుడు వయనాడ్‌పూ ఆయన వదిలిపెడతారని చర్చ జరుగుతున్నది. జాతీయ రాజకీయాల్లో యూపీ ఉన్న ప్రాధాన్యత కారణంగా రాయబరేలీతో కలిసి వెళ్లడం దాదాపు ఖాయమని వర్గాలు తెలిపాయి.