జనసేన శాసనసభ పక్ష నాయకుడిగా పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఎన్నికయ్యారు. మంగళవారం ఉదయం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన శాసనసభ పక్ష సమావేశం నిర్వహించారు. తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ ఈ సమావేశంలో జనసేన శాసనసభ పక్ష నాయకుడిగా పవన్‌ను ప్రతిపాదించారు. సభ్యులందరూ ఏకగ్రీవంగా బలపరిచారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 164 సీట్లు సాధించిన విషయం తెలిసిందే. కూటమిలో భాగమైన జనసేన 21 సీట్లకు పోటీ చేసి 21 సీట్లను కూడా గెలుచుకుంది. ఈ నెల 12వ తేదీన ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చంద్రబాబుతో పాటు మరికొంతమంది కూటమి ఎమ్మెల్యేలు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.
జనసేన నుంచి 4 మంత్రి పదవులను అడుగుతారని తెలుస్తోంది. పవన్‌కు ఉపముఖ్యమంత్రి పదవి ఖరారైనట్టు చెబుతున్నారు. తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్‌కు సైతం మంత్రి పదవి దక్కనుందని భావిస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో మరో రెండు పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. వాటిలో అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ద ప్రసాద్‌లను మంత్రులుగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని జోరుగా ప్రచారం జరుగుతోంది.
కాగా, సోమవారం మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ కీలక నేతలతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై పవన్ చర్చించారు. మంత్రి వర్గంలో పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్‌తో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరనే దానిపైనా చర్చించినట్టుగా తెలుస్తోంది.

More Stories
ఏపీలో కొత్తగా మార్కాపురం, మదనపల్లె, పోలవరం జిల్లాలు
1500 ఏళ్ల భావన్నారాయణ స్వామి రథం వేలం
28న అమరావతిలో 12 బ్యాంకుల భవనాలకు శంకుస్థాపన