పోలింగ్ రోజున వైసిపి మూకలు విధ్వంసం సృష్టించాయి!

రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల రోజు, ఆ తర్వాత వైసీపీ మూకలు విధ్వంసం సృష్టించాయని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) నిర్ధారించింది. టీడీపీ అభ్యర్థులు, సానుభూతిపరులపై దాడులు చేసి, హత్యాయత్నానికి పాల్పడ్డారని తేల్చింది. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో హింసాత్మక ఘటనలపై వాస్తవాలను వెలికి తీసేందుకు ఎన్నికల కమిషన్‌ ఆదేశాలతో ఐజీ వినీత్‌ బ్రిజిలాల్‌ నేతృత్వంలో సిట్ ను ఏర్పాటు చేశారు. 
 
రంగంలోకి దిగిన సిట్‌ బృందాలు క్షుణ్ణంగా దర్యాప్తు నిర్వహించి 157 పేజీల నివేదికను డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తాకు సమర్పించాయి. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి పోలింగ్‌ బూత్‌లోకి దూసుకొచ్చి ఈవీఎంలు విధ్వంసం చేసిన తీరు నుంచి పోలీసు స్టేషన్లోకి చొచ్చుకెళ్లిన వైనాన్ని ఆ నివేదికలో వివరించారు. 
 
ఎన్నికల హింసపై 35 కేసులు, ఈవీఎంల ధ్వంసంపై 2 కేసులు నమోదయ్యాయని, 447మంది ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేసినట్లు సిట్‌ వెల్లడించింది. 32 ఎఫ్‌ఐఆర్‌లలో అదనపు సెక్షన్లు జోడించినట్లు తెలిపింది. 25 కేసుల్లో వెబ్‌ కాస్టింగ్‌ ఫుటేజీ తీసుకుని ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌కు పంపామని, రిపోర్టు చార్జిషీట్లకు జతచేసి కోర్టులో దాఖలు చేసినట్లు పేర్కొంది. 
 
1,450 మందికి పైగా నిందితులు ఉన్నారని, ఇప్పటివరకూ 718మందిని అరెస్టు చేసి, మిగతా వారికి 41ఏ నోటీసులు జారీ చేసినట్లు తెలిపింది. ఎన్నికల్లో పోటీచేస్తూ చట్టవిరుద్ధంగా హింసకు పాల్పడిన, అనుచరుల్ని ప్రోత్సహించిన అభ్యర్థులకు సీడీఆర్‌లు, టవర్‌ డంప్‌ల ద్వారా మొబైల్‌ నెట్‌వర్క్‌లు అందించే డేటాతో ఉచ్చు బిగిస్తున్నట్లు చెప్పింది. 
 
ధ్వంసమైన ఈవీఎంల ముక్కలు, ఫొటోలు, వీడియోలు అన్నీ సేకరించామని పేర్కొంది. సిట్‌ ప్రధాన కార్యాలయంతో పాటు జిల్లాల్లోని సిట్‌ అధికారులకు మొత్తం 43 వినతులు అందగా టీడీపీ నుంచి 21, వైసీపీ నుంచి 19, బీజేపీ 1, ఇతరులు 2 ఇచ్చినట్లు వెల్లడించింది.