లోక్ సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ

లోక్ సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీని నియమించాలని కోరుతూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం చేసిందని పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ శనివారం తెలిపారు. లోక్ సభలో ప్రతిపక్ష నేత పదవి చేపట్టాలని రాహుల్ గాంధీని సీడబ్ల్యూసీ ఏకగ్రీవంగా కోరింది. పార్లమెంట్ లోపల ప్రతిపక్షానికి నాయకత్వం వహించడానికి రాహుల్ సరైన వ్యక్తి అని కేసీ వేణుగోపాల్ మీడియా సమావేశంలో పేర్కొన్నారు.
 
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మనీష్ తివారీ, డీకే శివకుమార్, రేవంత్ రెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్‌ గాంధీని నియమించాలని సీడబ్ల్యూసీ తీర్మానం చేసింది.
 
 2024 లోక్ సభ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ చేసిన అలుపెరగని కృషిని సీడబ్ల్యూసీ తీర్మానం ప్రశంసించింది.  ‘‘కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా చేసిన భారత్ జోడో యాత్ర, భారత్ జోడో న్యాయ్ యాత్ర కాంగ్రెస్ ను దేశ ప్రజలకు మరింత దగ్గర చేసింది. ఆయన ఆలోచనలను, వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే ఈ రెండు యాత్రలు దేశ రాజకీయాల్లో చారిత్రాత్మక మలుపులు. లక్షలాది మంది కార్యకర్తలు, కోట్లాది మంది ఓటర్లలో ఆశలు, విశ్వాసాన్ని ఈ రెండు యాత్రలు నింపాయి’’ అని సీడబ్ల్యూసీ తీర్మానంలో పేర్కొన్నారు.

‘‘రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం సింగిల్ మైండెడ్ గా, పదునైనదిగా, సూటిగా సాగింది. 2024 ఎన్నికల్లో రాజ్యాంగ పరిరక్షణను ప్రధాన అంశంగా చేసింది ఆయనే. ఎన్నికల ప్రచారంలో చాలా శక్తివంతంగా ప్రతిధ్వనించిన పాంచ్ న్యాయ్-పచీస్ హామీ కార్యక్రమం రాహుల్ యాత్రల ఫలితమే” అని తెలిపారు. 

 అయితే, లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేత పదవిని స్వీకరించడానికి రాహుల్ గాంధీ అంగీకరించారా? అని ప్రశ్నించగా, త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ చెప్పారు. తమ నాయకుడు, కార్యకర్తలను ఉత్సాహపరచడంతో కాంగ్రెస్ పునరుజ్జీవనం ప్రారంభమైందని వేణుగోపాల్ తెలిపారు.

“ప్రజలు అధికార పార్టీ  నియంతృత్వ, ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడారు. ఇది గత 10 సంవత్సరాల రాజకీయాలను నిర్ణయాత్మకంగా తిరస్కరించడం. ఇది విభజన, ద్వేషం, ధ్రువణ రాజకీయాలను తిరస్కరించడం” అని ఖర్గే స్పష్టం చేశారు. “మనం తక్షణ నివారణ చర్యలు చేపట్టాలి. ఇవి సాంప్రదాయకంగా కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్న రాష్ట్రాలు, ఇక్కడ మనకు అవకాశాలు ఉన్నాయి, వీటిని మన స్వంత ప్రయోజనాల కోసం కాకుండా మన ప్రజల ప్రయోజనం కోసం ఉపయోగించుకోవాలి. ఈ కసరత్తును అతి త్వరలో నిర్వహించాలని నేను ప్రతిపాదిస్తున్నాను, ”  అని మూడు రాస్త్రాలలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలను ప్రస్తావిస్తూ చెప్పారు.