కవిత జ్యుడీషియల్‌ రిమాండ్‌ పొడిగింపు

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాత్రపై సీబీఐ సప్లిమెంటరీ ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత పాత్ర, అందుకు సంబంధించిన సాక్ష్యాలతో కూడిన సప్లిమెంటరీ చార్జిషీట్‌ను దాఖలు చేసినట్టు సీబీఐ శుక్రవారం రౌస్‌అవెన్యూ కోర్టుకు తెలిపింది. దానిని పరిగణనలోకి తీసుకోవాలని న్యాయస్థానాన్ని కోరింది. ఈ అంశంపై జూలై 6న విచారణ చేపడతామని న్యాయమూర్తి కావేరి భవేజా తెలిపారు.

మరోవంక, జూన్ 21వ తేదీ వ‌ర‌కు కవిత రిమాండ్ పొడిగించిన‌ట్లు పేర్కొంది. ఈ మేరకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో ఈడీ, సీబీఐ నమోదు చేసిన రెండు కేసుల్లో కవిత జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.  ప్రస్తుతం ఆమె తీహార్ జైలులో ఉన్నారు. పలుమార్లు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ కోర్టు నిరాకరిస్తూ వస్తోంది.

ఢిల్లీ ప్రభుత్వం 2021-22 ఎక్సయిజ్ పాలసీని రూపొందించడంలో, అమలు చేయడంలో అవినీతి, మనీలాండరింగ్కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో గత మార్చిలో ఎన్‌ఫోర్స్‌‌మెంట్‌ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత సీబీఐ మరో కేసు నమోదు చేసింది.  ఈ కేసులో కవిత పాత్రపై ఈడీ ఇటీవల అనుబంధ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. దాన్ని న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది.

తాజాగా సీబీఐ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జీషీట్ ను కూడా పరిగణనలోకి తీసుకోవటంతో కవిత రిమాండ్ ను పొడిగించింది. ఈ కేసుల్లోనే కవిత పాత్రపై సీబీఐ, ఈడీ అనుబంధ ఛార్జీషీట్లను దాఖలు చేస్తూ వస్తోంది. మరోవైపు కవిత బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ నిరాశే ఎదురవుతోంది. తాజాగా కోర్టు రిమాండ్ పొడిగించటంతో… జూన్ 21వ తేదీన తదుపరి ఆదేశాలు రానున్నాయి.