ఏపీ ప్రధాన కార్యదర్శిగా నీరభ్‌కుమార్‌ ప్రసాద్‌

ఏపీ ప్రధాన కార్యదర్శిగా నీరభ్‌కుమార్‌ ప్రసాద్‌
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఏపీ కేడర్‌కు చెందిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి నీరభ్‌కుమార్‌ ప్రసాద్‌ శుక్రవారం బాధ్యతలు తీసుకున్నారు. సచివాలయం మొదటి బ్లాక్‌లో ఆయన బాధ్యతలు స్వీకరించారు. 1987 బ్యాచ్‌కు చెందిన నీరభ్‌కుమార్‌ ప్రసాద్ ప్రస్తుతం రాష్ట్ర పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
 

సీఎస్ గా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న‌ చంద్రబాబుకు ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. సహచర అధికారులు సిబ్బందితో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు త‌న‌ వంతు కృషి చేస్తానని వెల్లడించారు. ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుగుణంగా తన పని ఉంటుందని, మంచి చేసేలా కృషి చేస్తానని పేర్కొన్నారు.. అభివృద్ధి, సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో మరింత సమర్థవంతంగా అమలుకు కృషి చేస్తానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందంజలో నిలిపేందుకు శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు.

రాష్ట్రంలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఇప్పటిరకు సీఎస్‌గా ఉన్న జవహర్‌ రెడ్డి గురువారం సెలవుపై వెళ్లగా ఆయనను బదిలీ చేశారు. ఆయన జూన్‌ నెలాఖరుకు పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో నీరభ్ కుమార్‌ను నియమిస్తూజీఏడీ పొలిటికల్ సెక్రటరీ సురేష్ కుమార్ జీవో జారీ చేశారు.

మరోవైపు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో సీఎంఓ ఏర్పాటుపై కసరత్తు మొదలైంది. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర సీఎంఓ బాధ్యతలు చూడనున్నారు. ఆయనను ముఖ్యమంత్రికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. రెండు రోజుల్లో మరో ఇద్దరు, ముగ్గురు అధికారులనూ నియమించే అవకాశం ఉంది.
 
నీరభ్‌కుమార్‌ ప్రసాద్‌ బాధ్యతలు చేపట్టిన కొద్ది గంటల్లోనే  ముఖ్యంగా ముఖ్యమంత్రి కార్యాలయంలో( సీఎంవో)లో పనిచేస్తున్న ముగ్గురు ఐఏఎస్‌ లను సీఎస్‌  బదిలీ చేశారు. పూనం మాలకొండయ్య, రేవు ముత్యాలరాజు, నారాయణ్‌ భరత్‌ గుప్తాలను సాధారణ పరిపాలనశాఖలో రిపోర్టు చేయాలని సీఎస్‌ ఆదేశాలు జారీ చేశారు.