ఏపీలో కూటమికి భారీ మెజారిటీ సాధించిన నేపథ్యంలో అధికార యంత్రాంగం కొత్త ప్రభుత్వం ఏర్పాటు తర్వాత మంత్రుల పేషీలు, కార్యాలయాల ఏర్పాట్లకు సంబంధించిన చర్యలకు ఉపక్రమించారు. అందులో భాగంగా సచివాలయంలోని వివిధ కార్యాలయాల వివరాలు సేకరిస్తున్నారు. సచివాలయ సామగ్రి వివరాలు నమోదు చేస్తున్నారు.
రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో సాధారణ పరిపాలన శాఖ మంత్రుల పేషీలు, ఛాంబర్లను స్వాధీనం కోసం చర్యలకు ఉపక్రించింది. సచివాలయంలో తమ అనుమతి లేకుండా ఎలాంటి పత్రాలు, వస్తువులు బయటకు తీసుకెళ్లొద్దంటూ జీఏడీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.
మంత్రులు, సలహాదారుల పేషీల నుంచి బోర్డులను సాధారణ పరిపాలన శాఖ సిబ్బంది తీసేశారు. మంత్రుల పేషీల్లోని ఫర్నిచర్, కంప్యూటర్ల వివరాలను నమోదు చేసుకుని జీఏడీ అధికారులు వాటితో సరిపోల్చుకుంటున్నారు. వ్యక్తిగత సామగ్రి సచివాలయం నుంచి బయటకు తీసుకెళ్లేందుకు బిల్లులు చూపించాలని జీఏడీ సిబ్బంది స్పష్టం చేస్తుంది.
ప్రత్యేకించి మంత్రుల పేషీలు, ప్రభుత్వ శాఖల్లోని దస్త్రాలు, కాగితాలను స్వాధీనం చేసుకుంది. కార్యాలయం నుంచి బయటికి వెళ్లే వాహనాలను ఎస్పీఎఫ్ సిబ్బంది తనిఖీలు చేస్తున్నారు. సచివాలయంలోని ఐటీ విభాగంలో బుధవారం ఉదయం పోలీసు అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఐటీ కమ్యూనికేషన్ విభాగంలో ఉద్యోగుల కంప్యూటర్‌లు, ల్యాప్ ట్యాప్‌లు, ఇతర ఉపకరణాలను తనిఖీ చేశారు.
ఐటీ విభాగంలోని కంప్యూటర్ నుంచి డేటా తస్కరణకు, డిలీట్ చేసేందుకు ప్రయత్నాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో అధికారుల తనిఖీలు ప్రాధాన్యత సంతరించుకుంది. ఉద్యోగుల నుంచి పెన్‌డ్రైవ్‌లు, డేటా హార్డ్ డ్రైవ్‌లను స్వాధీనం చేసుకున్నారు. సర్వర్‌లలో డేటా డిలీట్ చేసేందుకు ప్రయత్నాలు జరిగాయని ఆరోపణలు రావడంతో పోలీసులు తనిఖీలు చేశారని ఐటీశాఖ ఉన్నతాధికారులు తెలిపారు.
ముఖ్యమైన దస్త్రాలను ప్రాసెస్ చేయవద్దని రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ ఉత్తర్వులు జారీచేశారు. గుత్తేదారులకు నిధుల విడుదల, భూ కేటాయింపు దస్త్రాలు నిలిపివేయాలని ఆదేశించారు.
More Stories
స్వస్థత పేరుతో చర్చిలో ప్రార్థనలతో ఓ బాలిక బలి
ఏపీ మంత్రివర్గంలోకి నాగబాబు
పవన్ కల్యాణ్ ను చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్