
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి సునామీ సృష్టిస్తోంది. కూటమి అభ్యర్థులు 150కు పైగా నియోజకవర్గాలలో భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్నారు. కూటమి ప్రభంజనంలో వైసిపి అభ్యర్థులు విలవిల్లాడుతుండగా కూటమి ఆధిక్యాల్లో మ్యాజిక్ ఫిగర్ దాటేసింది.
కూటమి అభ్యర్థులు జిల్లాలకు జిల్లాలే స్వీప్ చేస్తున్న తరుణంలో ముఖ్యమంత్త్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మినహా మంత్రులంతా ఓటమి బాటలో పయనిస్తున్నారు. ఉత్తరాంధ్రను కూటమి ఊడ్చేస్తోంది. రాయలసీమలోనూ కూటమి జోరు కొనసాగుతోంది. కడప మినహా అన్ని జిల్లాల్లోనూ కూటమి హవా నడుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని చోట్ల కూటమిదే హవా. అసెంబ్లీలోనే కాదు.. లోక్‌సభలోనూ సత్తా చాటుతోంది. కృష్ణా, విజయనగరం, విశాఖలలో వైసీపీ కనీసం ఖాతా కూడా తెరవలేదు. ఉత్తరాంధ్రలో కూటమి అభ్యర్థులు పూర్తి స్థాయి మెజారిటీని కనబరుస్తున్నారు. గొడవలు జరిగిన తాడిపత్రి, మాచర్ల, చంద్రగిరి తదితర ప్రాంతాలన్నింటిలోనూ కూటమి సత్తా చాటుతోంది. దక్షిణ కోస్తాలో తిరుగులేని విజయం దిశగా దూసుకెళుతోంది.
రాజధాని పరిసర ప్రాంతాల్లోనూ కూటమి దూసుకెళ్తోంది. ఉమ్మడి గోదావరి, దక్షిణ కోస్తాలోనూ సైకిల్ పరుగులు పెడుతోంది. పెద్దిరెడ్డి, రోజా, బుగ్గన, కొడాలి నాని అంబటి, గుడివాడ అమర్నాథ్‌తో పాటు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వెనుకంజలో ఉన్నారు. కేవలం కడప జిల్లాలో మాత్రమే సగం సీట్లలో వైసిపి ఆధిక్యతలో ఉంది.
ప్రస్తుత ధోరణులు చూస్తుంటే వైసిపికి 20 సీట్లకు మించి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. కేవలం 23 సీట్లలో పోటీ చేసిన జన సేన 21 సీట్లలో గెలుపొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. లోక్ సభ ఎన్నికలలో సహితం కడప, ఒంగోలు మినహా అన్ని నియోజకవర్గాలలో ఎన్డీయే అభ్యర్థులు ఆధిక్యతలో ఉన్నారు.
కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు, మంగళగిరిలో నారా లోకేశ్, పిఠాపురంలో పవన్ కళ్యాణ్, రాజమండ్రి పార్లమెంటు స్థానంలో బీజేపీ అభ్యర్థి పురందేశ్వరి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. . కృష్ణా, గుంటూరు జిల్లాల్లో టీడీపీ క్లీన్ స్వీప్ చేయనున్నట్టు ప్రస్తుతం వచ్చిన ఫలితాలను బట్టి తెలుస్తోంది. ఇక కర్నూలు జిల్లాలో అయితే ఒక స్థానం మినహా మిగిలిన అన్ని చోట్లా ఎన్డీఏ కూటమి ఆధిక్యాన్ని కనబరుస్తోంది. ఇక కృష్ణా జిల్లాలో అయితే తొలి రౌండ్ నుంచి కూడా కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. తొలి రౌండ్ నుంచి కూడా కూటమి అభ్యర్థులు ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు.
ముఖ్యంగా కడప జిల్లాలో టీడీపీ ముందంజలో ఉండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. కడప, మైదుకూరు, రాయచోటి, జమ్మలమడుగులో టీడీపీ ముందంజలో ఉంది. ఇక వై నాట్ 175 అంటూ ఎన్నికల బరిలోకి దిగిన వైసీపీ పూర్తిగా చతికిలపడిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రతిపక్ష పార్టీల కంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించి…. పెద్ద ఎత్తున కసరత్తు చేసినప్పటికీ ఆశించిన ఫలితాలు వచ్చే పరిస్థితి కనిపించటం లేదు. దాదాపు కూటమి ఏపీలో సర్కార్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
More Stories
ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ఎబివిపి ఘన విజయం
బీహార్ లో ఎన్డీఏ – మహాఘట్ బంధన్ నువ్వా నేనా?
హిండెన్‌బర్గ్ ఆరోపణలపై అదానీకి సెబీ క్లీన్చిట్