మ‌సాలా శ్యాంపిళ్ల‌లో ఇథిలిన్ ఆక్సైడ్ ఆన‌వాళ్లు లేవు

రెండు ప్ర‌ధాన మ‌సాలా బ్రాండ్ల శాంపిళ్ల‌లో ఇథిలిన్ ఆక్సైడ్ ఆన‌వాళ్లు లేవ‌ని ఆహార నియంత్ర‌ణ సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) స్ప‌ష్టం చేసింది. ఎండీహెచ్‌, ఎవ‌రెస్ట్ బ్రాండ్ల‌కు చెందిన శ్యాంపిళ్ల‌ను .. 28 ల్యాబ‌రేట‌రీల్లో ప‌రీక్ష‌లు చేశారు. ఆ రిపోర్టును ఆహార నియంత్ర‌ణ సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐ రిలీజ్ చేసింది. అయితే మ‌రో ల్యాబ్‌ల‌కు చెందిన రిపోర్టులు ఇంకా పెండింగ్‌లో ఉన్నట్లు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండ‌ర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పేర్కొన్న‌ది. 
 
ఎండీహెచ్‌, ఎవ‌రెస్ట్ బ్రాండ్ల మసాలాలు నాణ్య‌త లేవ‌ని హాంగ్‌కాంగ్, సింగ‌పూర్ ఆందోళ‌న వ్య‌క్తం చేసిన నేప‌థ్యంలో ఎఫ్ఎస్ఎస్ఏఐ రిపోర్టును విడుదల చేసింది. ఎండీహెచ్‌, ఎవ‌రెస్ట్ బ్రాండ్ల‌కు చెందిన కొన్ని మ‌సాలా ప్యాకెట్ల‌లో మోతాదుకు మించి ఇథిలిన్ ఆక్సైడ్ ఉన్న కార‌ణంగా ఆ బ్రాండ్ల మ‌సాలాలు కొన‌రాదు అని హాంగ్‌కాంగ్ సెంట‌ర్ ఫ‌ర్ ఫుడ్ సేఫ్ట్ త‌మ దేశ పౌరుల‌కు ఆదేశాలు ఇచ్చింది.

హాంగ్‌కాంగ్ నిషేధించిన ఉత్ప‌త్తుల్లో ఎండీహెచ్ మ‌ద్రాస్ క‌ర్రీ పౌడ‌ర్‌, ఎవ‌రెస్ట్ ఫిష్ క‌ర్రీ మ‌సాలా, ఎండీహెచ్ సాంబార్ మ‌సాలా మిక్స్‌డ్ మ‌సాలా పౌడ‌ర్‌, ఎండీహెచ్ క‌ర్రీ పౌడ‌ర్ ఉన్నాయి. మ‌సాలాల‌పై ఆరోప‌ణ‌లు వ‌చ్చిన నేప‌థ్యంలో ఇండియాలోని అన్ని ప్రాంతాల్లో ఆ మ‌సాలా ప్యాకెట్ల‌ను సేకరించి ఫుడ్ సేఫ్టీ సంస్థ వాటికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించింది. 

ఎన్ఏబీఎల్ అక్రిడేష‌న్ ఉన్న ల్యాబ్‌ల్లో ఇథిలిన్ ఆక్సైడ్ ప‌రీక్ష‌లు చేప‌ట్టిన‌ట్లు ఎఫ్ఎస్ఎస్ఏఐ తెలిపింది. ఈ రెండు బ్రాండ్లే కాకుండా ఇత‌ర బ్రాండ్ల‌కు చెందిన మ‌రో 300 శ్యాంపిళ్ల‌ను కూడా ప‌రీక్షించిన‌ట్లు శాస్త్రీయ నిపుణులు తెలిపారు.  సైంటిఫిక్ ప్యాన‌ల్ బోర్డులో .. స్పేస్ బోర్డు, సీఎస్ఎంసీఆర్ఐ (గుజ‌రాత్‌), ఇండియ‌న్ స్పైస్ రీస‌ర్చ్ ఇన్స్‌టిట్యూట్‌ (కేర‌ళ‌), ఎన్ఐఎఫ్‌టీఈఎం (హ‌ర్యానా), బీఏఆర్సీ (ముంబై), సీఎంపీఏపీ (ల‌క్నో), డీఆర్డీవో (అస్సాం), ఐసీఏఆర్, నేష‌న‌ల్ రీస‌ర్చ్ సెంట‌ర్ ఆన్ గ్రేప్స్‌ (పుణె)కు చెందిన నిపుణులు ఉన్నారు.