
ఏపీలో పోలింగ్ రోజు, ఆ తర్వాత చెలరేగిన హింసపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ గుప్తాలతో భేటీ తర్వాత అసహనం వ్యక్తం చేస్తూ మూడు జిల్లాలకు చెందిన కీలక ఉన్నతాధికారులపై కొరడా ఝుళిపించింది. పల్నాడు, అనంతపురం జిల్లా ఎస్పీలపై సస్పెన్షన్ వేటు వేసింది.
ఈ ఇద్దరినీ వెంటనే విధుల్లోంచి తప్పించి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సీఎస్, డీజీపీలను ఆదేశించింది. అలాగే, పల్నాడు జిల్లా కలెక్టర్, తిరుపతి ఎస్పీలను బదిలీ చేయడంతో పాటు శాఖాపరమైన చర్యలకు ఆదేశించింది. ఈ మూడు జిల్లాల్లో మొత్తం 12మంది సబార్డినేట్ పోలీస్ అధికారులపై సస్పెన్షన్ వేటు వేసిన ఈసీ వారిపై శాఖాపరమైన చర్యలకూ ఆదేశించింది.
పోలింగ్ జరిగిన మే 13న పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో ఎక్కువగా హింస చెలరేగిందని దీన్ని నియంత్రించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఈసీ తెలిపింది. సీఎస్, డీజీపీలతో గురువారం భేటీ అనంతరం కేంద్ర ఎన్నికల సంఘంలోని ముగ్గురు కమిషనర్లు సమావేశమై ఏపీలో జరిగిన హింసాత్మక ఘటనలపై తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమైందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బాధ్యులైన అధికారులపై చర్యలు చేపట్టాలని సీఎస్, డీజీపీలకు ఆదేశాలు జారీ చేశారు. ఇకపై ఎలాంటి హింస చెలరేగకుండా చర్యలు చేపట్టాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతమైతే మరింత కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించింది.
రాష్ట్రంలో హింసపై ప్రతి కేసును ప్రత్యేకంగా తీసుకోవాలన్న ఈసీ ప్రతి కేసుపై సిట్ ఏర్పాటు చేసి రెండు రోజుల్లో నివేదించాలని ఆదేశించింది. ఎఫ్‌ఐఆర్‌లు పెట్టి ఐపీసీ, అన్ని సెక్షన్ల కింద కేసులుపెట్టాలని ఆదేశించింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల తీవ్రత దృష్ట్యా కౌంటిగ్ అనంతరం 15 రోజుల పాటు కంద్ర బలగాలను రాష్ట్రంలోనే ఉంచాలని ఇసి పేర్కొంది.
’25 కంపెనీల సిఎపిఎఫ్ బలగాలు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. వాటిని కౌంటింగ్ తరువాత కూడా 15 రోజుల పాటు రాష్ట్రంలోనే కొనసాగించాలని హోంశాఖకు సూచిస్తాం. కౌంటింగ్ తరువాత అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆ బలగాలు చూస్తాయి’ అని ఇసి తెలిపింది. పోలింగ్ అనంతర హింసపై కఠినంగా ఉండాలని సీఎస్, డీజీపీలకు ఆదేశాలు జారీచేసింది.
More Stories
టీటీడీ పరకామణిలో ఫారిన్ కరెన్సీ దోపిడీపై సీఐడీ దర్యాప్తు
పోలవరం నిర్వాసితులకు పునరావాస హామీలు నెరవేర్చాలి
టిడిపిలో చేరిన ముగ్గురు వైసీపీ ఎమ్యెల్సీలు