రాయలసీమ, పల్నాడు హింసపై గవర్నర్ కు కూటమి నేతల ఫిర్యాదు

రాయలసీమ, పల్నాడు హింసపై గవర్నర్ కు కూటమి నేతల ఫిర్యాదు

పల్నాడు, రాయలసీమ హింసాత్మక ఘటనలపై కూటమి నేతలు రాజ్ భవన్లో గవర్నర్కు ఫిర్యాదు చేశారు. హింసాత్మక ఘటనలు నివారించడంలో పోలీసులు అసమర్ధతగా వ్యవహరించారని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని నేతలు వెల్లడించారు. పెన్డ్రైవ్లో అన్ని వీడియో ఆధారాలను గవర్నర్కు అందజేయగా ఆ హింసాత్మక ఘటనలను చూసి ఆశ్చర్యపోయారని తెలిపారు.

జరిగిన హింసపై సీఎస్, డీజీపీలకు ఈసీ సమన్లు జారీ చేయడం సిగ్గు చేటని నేతలు మండిపడ్డారు. ఒడిపోతున్నామని తెలిసే ఈ విధమైన హింసను ప్రేరేపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెదలకు చెల్లించాల్సిన నిధులు గుత్తేదారులకు చెల్లించే యత్నానికి కూడా అడ్డుకట్ట వేయాలని గవర్నర్ను కోరామని తెలిపారు. 

తెలుగుదేశం నేతలు వర్ల రామయ్య, దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, బీజేపీ నేత లంకా దినకర్, జనసేన నేత చిల్లపల్లి శ్రీనివాస్లు గవర్నర్ అబ్దుల్ నజీర్తో ) భేటీ అయ్యారు.  ప్రజలు తనను తిరస్కరించారని జగన్‌కు అర్థమైందని తెలుగుదేశం నేత వర్ల రామయ్య అన్నారు. ఓటమి పాలవుతున్నామనే ఎన్నికల సమయంలో, తర్వాత అరాచకాలు సృష్టింస్తున్నారని ధ్వజమెత్తారు. ఓటింగ్‌ సమయంలో క్యూలో ఉన్న వారిని తరిమికొట్టాలని చూశారన్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద అరాచకాలు సృష్టించాలని వైసీపీ నేతలు నిర్ణయించారని చెప్పారు.

రాష్ట్రంలో ఎన్ని అరాచకాలు జరిగాయో గవర్నర్‌కు ఆధారాలతో సహా వివరించా మని,వైసీపీ నేతలతో కుమ్మక్కై పోలీసుల ఎలా వ్యవహరించారో వీడియోలు చూపించామని వర్ల రామయ్య మీడియాకు తెలిపారు. మాచర్ల, నరసరావుపేట, చంద్రగిరి, తాడిపత్రిలో జరిగిన దారుణాలను ప్రస్తావించామని చెప్పారు.  రాష్ట్రంలో ఇంత అరాచకం జరిగింది కాబట్టే సీఎస్‌, డీజీపీలను ఎన్నికల సంఘం ఢిల్లీకి పిలిచిందని గుర్తు చేశారు. 
 
ప్రజలు వైసీపీని తిరస్కరించారనే విషయం జగన్‌కు అర్థమైందని, ఓడిపోతున్నామని తెలిసి దాడులకు తెగబడ్డారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద క్యూలో ఉన్న ఓటర్లను భయపెట్టి అల్లర్లు సృష్టించారని, గొడవలు సృష్టించి పోలింగ్ శాతాన్ని తగ్గించడానికి ప్రయత్నించారని ఆరోపించారు.  ఎన్నికల తర్వాత కూడా చాలా చోట్ల గొడవలు కొనసాగాయని ఆందోళన వ్యక్తం చేశారు