ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది . ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవాహర్‌రెడ్డి, రాష్ట్ర డీజీపీ హారీష్‌కుమార్‌లకు సమన్లు జారీ చేసింది. పల్నాడు, చంద్రగిరి, తిరుపతి,తాడిపత్రి, నంద్యాల జిల్లాలో జరిగిన హింసను ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారని ప్రశ్నిస్తూ శుక్రవారం వ్యక్తిగతంగా ఢిల్లీకి వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
పోలింగ్ జరిగిన రెండు రోజులు కావస్తున్న రాష్ట్రంలో జరుగుతున్న హింసాత్మక ఘటనలు, అల్లర్లు అదుపులోకి తీసుకురాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యక్తిగతంగా ఎన్నికల కమిషన్ ముందు హాజరుకావాలని సమన్లు జారీ చేసింది. ఇసి ఆదేశాల మేరకు రేపు సిఎస్, డిజిపి ఢిల్లీ వెళ్లనున్నారు.
కాగా, పోలింగ్ తర్వాత తాడిపత్రి, మాచర్ల, చంద్రగిరి, నరసరావు పేటల్లో చాలా ఘటనలు జరిగాయని, మంగళవారం నుంచి డీజీపీతో సంప్రదింపులు చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా చెప్పారు.
ఎన్నికల సంఘంతో చర్చించిన తర్వాత నాలుగు చోట్ల 144 సెక్షన్ విధించి, అదనపు బలగాలను తరలించినట్టు చెప్పారు. స్థానిక పరిస్థితుల్ని అదుపులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. ఇప్పటి వరకు జరిగిన ఘటనలకు అభ్యర్థులే కారణమని గుర్తించామని, వారిపై కేసులు పెడుతున్నామని, వారిని నిర్బంధించాలని ఆదేశించినట్టు చెప్పారు.
అల్లర్లకు కారణమైన వారిని వెంటనే గుర్తించాలని ఆదేశించినట్టు చెప్పారు. నాలుగు ప్రాంతాల్లో 144 సెక్షన్ పెట్టామని, అదనపు బలగాలు పంపించామని సీఈఓ మీనా తెలిపారు. అల్లర్లు జరుగుతున్న ప్రాంతాలలో అభ్యర్థులు అందరినీ హౌస్ అరెస్టు చేయాలని అదేశాలిచ్చామని వెల్లడించారు. ఈ ఘటనలకు బాధ్యులైన వారిపై కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు.
ఈవీఎంలు ధ్వంసం చేసిన వారిని అరెస్టు చేసి జైలుకు పంపాలని ఏపీ డీజీపీకు అదేశాలిచ్చారు. పలు జిల్లాల్లో జరిగిన ఘటనలు అరికట్టడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని హెచ్చరించారు. రాష్ట్రంలో 715 ప్రాంతాల్లో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశామని మీనా పేర్కొన్నారు.
ఇలా ఉండగా, ఎన్నికల కమిషన్ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అధికార వైసీపీలో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. ఈవీఎంలు భద్రపరిచే స్ట్రాంగ్ రూంల వద్ద వైసీపీ పెద్ద ఎత్తున అవకతవకలకు ప్లాన్ చేసినట్లు అనుమానాలు తలెత్తుతున్నాయి.
అందులో భాగంగానే పల్నాడు జిల్లాలోని మాచర్ల, కారంపూడి, తిరుపతి, అనంతపురం జిల్లాలోని తాడిపత్రి, నరాసరావుపేటలో దాడులకు పాల్పడుతున్నారనే విమర్శలు చెలరేగుతున్నాయి. పోలింగ్ తర్వాత తాడిపత్రి, మాచర్ల, చంద్రగిరి, నరసరావు పేటలో చాలా హింసాత్మక ఘటనలు జరిగాయని, దాడులకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటున్నామని ఎన్నికల సంఘం తెలిపింది.
పల్నాడులో ప్రకటిత కర్ఫ్యూ
ఇలా ఉండగా, పోలింగ్ సందర్భంగా పల్నాడు జిల్లాలో చెలరేగిన హింసాత్మక సంఘటనలు రెండోరోజూ కొనసాగడంతో ఈసీ 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఈ మేరకు జిల్లా పాలనాధికారి శివశంకర్ పోలీసు శాఖకు ఉత్తర్వులిచ్చారు. నరసరావుపేట లోక్‌సభ స్థానంతో పాటు నరసరావుపేట, వినుకొండ, సత్తెనపల్లి, పెదకూరపాడు, గురజాల, మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో గత రాత్రి నుంచి తదుపరి ఆదేశాలు జారీచేసే వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. అల్లర్లు జరుగుతాయన్న ప్రచార నేపద్యంలో పల్నాడు జిల్లా మాచర్లకు వచ్చే అన్ని వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించి మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు పోలీసులు. అనుమానస్పదంగా ఉంటే వారిని అదుపులోకి పోలీసులు తీసుకుంటున్నారు. అల్లర్లు, హింసాత్మక ఘటనలకు పాల్పడితే ఎవరైనాసరే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు.
ఇక గత రాత్రి నుంచి పల్నాడు జిల్లా మాచర్లలోనే ఐజి సర్వ శ్రేష్ట త్రిపాఠి మకాం వేశారు. పల్నాడు ఎస్పితో పాటు ఇతర సీనియర్ పోలీసు అధికారుల నేతృత్వంలో, ఏకంగా 2300 మంది సిబ్బందితో భద్రత ఏర్పాట్లు చూస్తున్నారు. మరోవైపు పల్నాడులో అనేక ప్రాంతాల్లో అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తున్నది.
More Stories
టీటీడీ పరకామణిలో ఫారిన్ కరెన్సీ దోపిడీపై సీఐడీ దర్యాప్తు
పోలవరం నిర్వాసితులకు పునరావాస హామీలు నెరవేర్చాలి
టిడిపిలో చేరిన ముగ్గురు వైసీపీ ఎమ్యెల్సీలు