ఏపీలో 81 శాతం, తెలంగాణలో 64.74 శాతం పోలింగ్!

ఏపీలో 81 శాతం, తెలంగాణలో 64.74 శాతం పోలింగ్!

తెలుగు రాష్ట్రాల్లో గతంతో పోలిస్తే ఈ ఎన్నికల్లో భారీగా పోలింగ్ నమోదైంది. ఏపీలో కొన్ని చోట్ల రాత్రి 2 గంటల వరకూ పోలింగ్ కొనసాగినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్‌ కుమార్‌ మీనా తెలిపారు. సోమవారం రాత్రి 12 గంటల వరకు దాదాపు 78.25 శాతం పోలింగ్‌ నమోదు కాగా…1, .2శాతం పోస్టల్‌ బ్యాలెట్‌తో కలిపి మొత్తం 79.4 శాతం ఓటింగ్ నమోదయ్యే అవకాశం ఉందని చెప్పారు.

అయితే పోలింగ్ శాతంపై మంగళవారం స్పష్టత వస్తుందని, సుమారు 81 శాతం పోలింగ్‌ నమోదు అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామని సీఈవో మీనా తెలిపారు.   2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో 75.9 శాతం, 2014 ఏపీ ఎన్నికల్లో 78.4 శాతం, 2019 శాసనసభ ఎన్నికల్లో 79.2 శాతం మేర పోలింగ్ నమోదైంది.

2019 సార్వత్రిక ఎన్నికల్లో 79.2శాతం పోలింగ్‌ నమోదు కాగా, 0.6 శాతం పోస్టల్‌ బ్యాలెట్‌తో కలిపి మొత్తం 79.80 శాతం పోలింగ్ నమోదైందని చెప్పారు. రాష్ట్రంలో నిన్న పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంపై సీఈవో మీనా ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులను గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పోటీ చేసిన కాకినాడ జిల్లా పిఠాపురం నియోజక వర్గంలో 86.87 శాతం పోలింగ్‌ రికార్డైంది. ఇందులో పురుషులు 1,03,604 మంది, మహిళలు 1,01,762 మంది, ఇతరులు ముగ్గురు ఓట్లు వేయగా… మొత్తం 2,36,409 ఓట్లకు 2,05,369 ఓట్లు పోలైనట్లు అధికారులు తెలిపారు.

కాగా, తెలంగాణ లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా సాగింది. సోమవారం రాత్రి 11 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా 64.74 శాతం పోలింగ్‌ నమోదైంది. సాయంత్రం 6 గంటలకు క్యూ లైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. పూర్తి స్థాయి అధికారిక లెక్కలను ఈసీ ప్రకటించాల్సి ఉంది. మరో రెండు శాతం పోలింగ్‌ పెరిగే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు అంటున్నారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో 62.07 శాతం పోలింగ్‌ నమోదు కాగా..ఈసారి భారీగా పెరిగింది.