నిజ్జర్ హత్య కేసులో మరో భారతీయుడి అరెస్ట్

Canadian police have arrested four Indians – (clockwise from top left) Amandeep Singh, Karan Brar, Kamalpreet Singh and Karanpreet Singh – in connection with Hardeep Singh Nijjar's (left) killing

ఖ‌లిస్తానీ ఉగ్రవాది హ‌ర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో మరో భారతీయుడిని కెనడా పోలీసులు అరెస్టు చేశారు. హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ గతేడాది కెనడాలో హత్యకు గురైన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసుతో సంబంధమున్న ముగ్గురు భార‌తీయులను అదుపులోకి తీసుకున్నారు. తాజాగా శనివారం అమన్‌దీప్‌ సింగ్‌ అనే 22 ఏండ్ల యువకుడిని అరెస్టు చేసిన‌ట్లు అధికారులు వెల్లడించారు. 
 
బ్రాంప్టన్‌లో నివసిస్తున్న అమన్‌దీప్‌.. ఆయుధాలకు సంబంధించిన కేసులో అంటారియో పోలీసుల కస్టడీలో ఉన్నాడని, అతడిని తమ అదుపులోకి తీసుకున్నామని ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ ఇన్‌చార్జి మన్‌దీప్‌ మూకర్‌ వెల్లడించారు. ఇదే కేసులో కరణ్‌ బ్రార్‌, కమల్‌ప్రీత్‌ సింగ్‌, కరణ్‌ప్రీత్‌ సింగ్‌లను పోలీసులు గత వారం అరెస్టు చేశారు. 
 
అయితే నిజ్జార్ హ‌త్య త‌ర్వాత భార‌త్, కెన‌డా మ‌ధ్య దౌత్య సంబంధాలు బ‌ల‌హీన‌ప‌డ్డ విష‌యం తెలిసిందే. నిజ్జార్ మ‌ర్డర్ వెనుక భార‌తీయ ఏజెంట్లు ఉన్నట్లు కెన‌డా ప్రధాని ట్రూడో ఆరోపించారు. కానీ ఆ ఆరోప‌ణ‌ల‌ను భార‌త్ ఖండించిన విష‌యం తెలిసిందే. ఇండియాలో వాంటెడ్ లిస్టులో ఉన్న ఉగ్రవాది నిజ్జార్‌ను 2023, జూన్ 18వ తేదీన కెన‌డాలోని స‌ర్రేలో ఉన్న ఓ గురుద్వారా వ‌ద్ద హ‌త్య చేశారు.
 
‘హరదీప్ సింగ్ నిజ్జర్ హత్యలో కేసులో నిందితులను పట్టుకోడానికి కొనసాగుతున్న మా దర్యాప్తును స్వభావాన్ని ఈ అరెస్ట్ నిర్దారిస్తుంది’ అని ఒట్టావా ఎస్పీ మణిదీప్ మూకర్ అన్నారు. నిందితులపై ఫస్ట్‌ డిగ్రీ హత్య కేసు అభియోగాలు మోపినట్లు కెనడా అధికారులు వెల్లడించారు. గతేడాది జూన్ 18న బ్రిటిష్ కొలంబియాలోని సర్రె గురునానక్ సిక్కు గురుద్వారా వద్ద గుర్తుతెలియని వ్యక్తులు కాల్పుల్లో నిజ్జర్ చనిపోయిన విషయం తెలిసిందే.
 
ఎడ్మంటన్‌ ప్రాంతంలో నివాసముంటున్న నిందితులకు పాక్ గూఢచారి సంస్థ ఐఎస్ఐతో లింకులున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. భారత్ నేరస్థులుగా గుర్తించిన పలువురు గ్యాంగ్‌స్టర్లు కెనడాలో ఉంటూ దేశ వ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఖలిస్థానీ వేర్పాటువాదాన్ని ఎగదోసేందుకు ఐఎస్‌ఐ నిరంతరం నిధులు అందజేస్తోంది. 
 
దీనిపై భారత్ ఎంతగా చెబుతున్నా కెనడా మాత్రం చెవికెక్కించుకోవడం లేదు. ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి ఆ దేశానికి ఆధారాలు అందజేసినా చర్యలు తీసుకోవడం లేదు. ఇక, నిజ్జర్ హత్య కేసులో భారతీయ ఏజెంట్ల పాత్రపై తమకు విశ్వసనీయ సమాచారం ఉందంటూ గతేడాది కెనడా ప్రధాని చేసిన వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి.

ఉగ్రవాదం సమస్య సహా పలు ప్రధాన అంశాల్లో ఢిల్లీ ప్రయోజనాల కోసం కెనడా నేతలను ప్రభావితం చేసేందుకు కొందరు భారత అధికారులు, స్థానిక ప్రతినిధులు పలు ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారని ఇటీవల ఓ దర్యాప్తు నివేదిక పేర్కొంది. అయితే, ఈ ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. కెనడాలోని అంతర్గత రాజకీయాల కారణంగా తలెత్తే సమస్యలని, తమకు ఎలాంటి సంబంథం లేదని భారత్ స్పష్టం చేసింది.