ప్రజ్వల్​ రేవణ్ణ విషయంలో ముందే హెచ్చరించిన బీజేపీ నేత అరెస్ట్

జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ లైంగిక దౌర్జన్యం వ్యవహారంలో ప్రజావేగుగా నిలిచిన బీజేపీ నేత దేవరాజే గౌడ అరెస్ట్​ అయ్యారు. శుక్రవారం రాత్రి గులిహల్ టోల్ గేట్ వద్ద ఆయన్ను అరెస్ట్​ చేశారు. దేవరాజే తనను లైంగికంగా వేధింపులకు గురిచేశాడని ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అదుపులోకి తీసుకున్నారు.

బీజేపీకి చెందిన దేవరాజే గౌడ ఓ న్యాయవాది. ప్రజ్వల్‌ రేవణ్ణ వ్యవహారం బయటకు వచ్చిన సమయంలో ఆయన పేరు ప్రముఖంగా వినిపించింది. హాసన్ జిల్లాకు చెందిన ఓ మహిళ (36) తనను దేవరాజే మోసం చేశారంటూ ఏప్రిల్​ 1న హోలెనరసీపుర్ పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. తన ఆస్తిని విక్రయించడంలో సాయం చేస్తాననే నెపంతో తనను వేధించాడని అందులో ఆరోపణలు చేశారు. ఆ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హాసన్ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఏప్రిల్ 1నే ఆయనపై కేసు నమోదుకాగా.. తాజాగా బయటపడింది. ఈ ఆరోపణలపై దేవరాజే గౌడ ఫేస్‌బుక్‌లో స్పందించారు. ఇదంతా కుట్రేనని కొట్టిపారేశారు. మహిళ, ఆమె భర్త తనను ఆఫీసులో కలిశారని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి హాసన్ పోలీసులు ఇచ్చిన సమాచారంతో హిర్​యుర్​ పోలీసులు, ఇన్నోవా కారులో ప్రయాణిస్తున్న దేవరాజే గౌడను శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు. అనంతరం హాసన్ పోలీసులకు అప్పగించారు.

లోక్‌సభ ఎన్నికల్లో ప్రజ్వల్ రేవణ్ణకు మద్దతివ్వొద్దంటూ బీజేపీకి గతేడాది ఆయన సూచించారు. ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యాల వీడియోలు అనేకం ఉన్నాయని, అవి బయటకు వస్తే పార్టీకి చేటు కలుగుతుందని హెచ్చరించారు. ఇక దేవరాజే గౌడ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజ్వల్‌ తండ్రి, మాజీ ప్రధాని దేవెగౌడ కుమారుడు హెచ్‌డీ రేవణ్ణపై పోటీ చేసి ఓడిపోయారు.

 మరోవైపు, ఇటీవల ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అయ్యాయి. ప్రజ్వల్‌, ఆ వీడియోలు వెలుగు చూసిన తర్వాత విదేశాలకు పరారయ్యారు. ఆయనపై ఇంటర్ పోల్ ద్వారా బ్లూకార్నర్‌ నోటీసులు జారీ అయ్యాయి. ప్రజ్వల్‌పై అత్యాచారం, వేధింపులు, బెదిరింపులు తదితర సెక్షన్ల కింద పోలీసులు 3 ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు. 

అయితే వీడియోలు లీక్ చేసింది బీజేపీ నేత దేవరాజే గౌడనే అని ఆరోపణలు వచ్చాయి. వాటిని దేవరాజే గౌడ తోసిపుచ్చారు. జేడీఎస్‌, బీజేపీ నాయకులు ఆ వీడియోలను విడుదల చేయలేదని చెప్పారు. అధికార పార్టీ కాంగ్రెస్‌ నేతలే వాటిని విడుదల చేసి ఉంటారని ఆరోపించడం గమనార్హం. ఈ అంశంపై దర్యాప్తు చేస్తున్న సిట్‌ నోటీసులు ఇస్తే తన వద్ద ఉన్న ఆధారాలను అందజేస్తానని తెలిపారు.