
టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో నెలకొన్న వివాదం రోజురోజుకూ ముదురుతోంది. సిబ్బంది మూకుమ్మడి సెలవులతో సుమారు 100 విమానాలను ఎయిరిండియా సంస్థ రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో సెలవులు పెట్టి విమాన సేవలకు అంతరాయం కల్పించిన వారిపై సంస్థ తాజాగా చర్యలకు ఉపక్రమించింది. సుమారు 30 మంది సిబ్బందిపై సంస్థ వేటు వేసింది. ఈ మేరకు బుధవారం రాత్రి 30 మంది సిబ్బందికి సంస్థ తొలగింపు నోటీసులు పంపినట్లు సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి. సర్వీస్ రూల్స్ ఉల్లంఘించిన కారణంగా తక్షణమే వారిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు సంస్థ నోటీసుల్లో పేర్కొంది. సరైన కారణం లేకపోయినా కావాలనే సెలవు పెట్టారని, ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఇదంతా చేశారని ఉద్యోగులకు పంపిన నోటీసుల్లో సంస్థ పేర్కొంది.
మరికొన్ని రోజులు ఇబ్బందులు తప్పవని కంపెనీ సీఈఓ అలోక్ సింగ్ చెప్పారు. షెడ్యూల్ ప్రకారం విధులకు హాజరు కావాల్సిన సిబ్బంది చివరి నిమిషంలో సిక్ లీవ్ పెట్టడంతోనే ఈ సమస్య ఉత్పన్నమైందని తెలిపారు. సుమారు 200 మంది ఉద్యోగులు ఇలా సెలవు పెట్టారని వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే భారీగా విమానాలను రద్దు చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
మరోవైపు వరుసగా రెండో రోజు(గురువారం) కూడా దాదాపు 74 విమానాలు రద్దు చేసినట్లు ఎయిర్ ఇండియా పేర్కొంది. చివరి నిమిషయంలో విమానాలను రద్దు చేయడం వల్ల ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేరళలోని తిరునవంతపురం, కొచ్చి, కన్నూర్ విమానాశ్రయాల్లో గల్ఫ్ దేశాలకు వెళ్లే విమానాలు చివరి నిమిషంలో నిలిచిపోవడం వల్ల ప్రయాణికులు అక్కడే ఉండిపోయారు. ప్రస్తుతం ఉన్న ఈ అంతరాయాలను తగ్గించడానికి ఎయిర్ ఇండియా 20 మార్గాల్లో విమానాలను నడుపుతామని పేర్కొంది.
More Stories
ప్రపంచ కుబేరుడిగా ఒరాకిల్ కో-ఫౌండర్ ల్యారీ
ట్రంప్ సుంకాలతో 0.5 % తగ్గనున్న జిడిపి
రద్దైన నోట్లతో శశికళ బినామీ షుగర్ ఫ్యాక్టరీ.. సీబీఐ కేసు