ఇజ్రాయిల్ లో `అల్‌జజీరా’ కార్యాలయాల మూసివేత

ఖతార్‌ మీడియా అల్‌జజీరాను శాశ్వతంగా మూసివేయనున్నట్లు ఇజ్రాయిల్‌ ప్రకటించింది. అల్‌జజీరా స్థానిక కార్యాలయాలను మూసివేయడానికి తమ ప్రభుత్వం ఏకగ్రీవంగా ఓటు వేసిందని ఇజ్రాయిల్‌ ప్రధాని నెతన్యాహూ ఆదివారం ఎక్స్‌లో పేర్కొన్నారు. అయితే ఈ నిర్ణయం ఎప్పుడు అమలులోకి వస్తుంది?తాత్కాలికంగా లేదా శాశ్వతంగా మూసివేస్తారా? అనే వివరాలు తెలియాల్సి వుంది.

గాజాపై ఇజ్రాయిల్‌ మారణకాండకు పాల్పడిందన్న అంతర్జాతీయ మీడియా సంస్థల్లో అల్‌జజీరా ఒకటి. గాజాలోని వైమానిక దాడులతో పాటు భీతావహ  రక్తపు మడుగులో పడి వున్న  ఆస్పత్రుల దృశ్యాలను ప్రపంచానికి వెల్లడించింది. దీంతో అల్‌జజీరా హమాస్‌కు సహకరిస్తోందని ఇజ్రాయిల్‌ ఆరోపిస్తోంది. అయితే ఈ ప్రకటనపై అల్‌జజీరా స్పందించాల్సి వుంది.

గాజాలో ఇజ్రాయిల్‌ కాల్పుల విరమణ చర్చలకు సంబంధించి ఖతార్‌ ప్రభుత్వం మధ్యవర్తిగా కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ స మయంలో మీడియాను నిలిపివేయాలన్న నిర్ణయం ఖతార్‌తో దీర్ఘకాల వైరాన్ని పెంచే అవకాశం ఉందని పలువురు హెచ్చరిస్తున్నారు. ఈ ఛానల్‌ ఖతార్‌కు చెందినది కావడంతో ఆ దేశంతో సైతం ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.