
బంగాల్ గవర్నర్ సీవీ ఆనందబోస్‌పై లైంగిక ఆరోపణలు పెను దుమారాన్ని రేపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే స్పందించిన గవర్నర్, తనపై వచ్చిన నిరాధార ఆరోపణలపై పోరాడుతానని స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రజలకు తన సందేశాన్ని ఇచ్చి సొంత రాష్ట్రమైన కేరళకు బయలుదేరారు. ఆయన కొన్ని రోజుల పాటు అక్కడే ఉంటారని అధికారులు తెలిపారు. ‘‘మీ తదుపరి గ్రెనేడ్, దాచిపెట్టిన బుల్లెట్ల గురించి ఎదురుచూస్తున్నా. దయచేసి కాల్చండి’’ అని ఆడియో సందేశాన్ని విడుదల చేశారు.
“రాజ్ భవన్ లో కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన వ్యక్తులు దూరారు. వారు దురుద్దేశంతో ప్రతిష్ఠను భంగం చేయాలనే వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందింది. దీనిపై వివిధ సంస్థలు సైతం దర్యాప్తు చేపట్టాయి. ఇవన్నీ కేవలం ఎన్నికల కోసం వేసిన పధకం మాత్రమే.” అని ఆనంద్ బోస్ స్పష్టం చేశారు.
మరోవంక, రాజ్‌భవన్‌లో సిబ్బందికి గవర్నర్ శుక్రవారం సరికొత్త ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రంలో ఉన్న రాజ్‌భవన్‌లోకి పోలీసులు, రాష్ట్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి చంద్రిమా భట్టాచార్య ప్రవేశించకుండా పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద బోస్ నిషేధం విధించారు. గవర్నర్‌పై పరువునష్టం, రాజ్యంగ వ్యతిరేక ప్రకటనలు చేసినందుకు కోల్‌కతా, డార్జిలింగ్, బరాక్‌పూర్‌లోని రాజ్భవన్ల ప్రారగణంలోకి ప్రవేశించకుండా నిషేధించడమైనదని ఉత్తర్వులో పేర్కొంది.
మంత్రి పాల్గొనే ఏ కార్యక్రమంలో కూడా గవర్నర్ పాల్గొనరని కూడా ఉత్తర్వు పేర్కొంది. మంత్రికి వ్యతిరేకంగా తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు భారత అటార్నీ జనరల్‌ను సలహా కోసం గవర్నర్ సంప్రదించినట్లు కూడా ఉత్తర్వు తెలిపింది. మరొక ఉత్తర్వులో ‘ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులను శాంతింపజేసేందుకు అనధికార, చట్టవిరుద్ధమైన, బూటకపు, ప్రేరేపిత ‘విచారణ’ చేసే ముసుగులో రాజ్‌భవన్ ఆవరణలోకి ప్రవేశించకుండా పోలీసులపై కూడా గవర్నర్ నిషేధం విధించారు’ అని పేర్కొన్నారు.
అంతకుముందు ఈ వార్తలపై ఎక్స్ వేదికగా స్పందించింది రాజ్ భవన్ కార్యాలయం. “ఇద్దరు అసంతృప్త ఉద్యోగులు కొన్ని రాజకీయ పార్టీలకు ఏజెంట్లుగా మారి అసత్య కథనాలు ప్రచారం చేశారు. నిజం గెలుస్తుంది. సృష్టించిన కథనాలకు నేను భయపడను. ఎవరైనా నన్ను కించపరిచి ఎన్నికల ప్రయోజనాలు పొందాలనుకుంటే వారిని దేవుడే చూసుకుంటాడు. కానీ బంగాల్లో అవినీతి, హింసకు వ్యతిరేకంగా నా పోరాటాన్ని వారు నిలువరించలేరు” అని రాజ్‌భవన్ కార్యాలయం ఎక్స్‌లో పోస్ట్ చేసింది. గవర్నర్ బోస్ తనను లైంగిక వేధింపులకు
గురిచేసినట్లు రాజ్‌భవన్‌లో పనిచేసే ఓ కాంట్రాక్ట్ ఉద్యోగిని గురువారం మధ్యాహ్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉద్యోగం విషయంలో ప్రయోజనాలు చేకూర్చుతానన్న నెపంతో గవర్నర్ తనను వేధించారని అందులో ఆరోపించారు. ఈ ఘటనపై తృణమూల్ కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. ‘‘సందేశ్‌ఖాలీలో మహిళా హక్కుల గురించి మాట్లాడిన వ్యక్తే ఇప్పుడు ఇలాంటి అవమానకరమైన చర్యకు పాల్పడ్డారు. గవర్నర్ పదవికి అప్రతిష్ఠ తెచ్చారు’’ అంటూ విమర్శలు గుప్పించింది.
ప్రధాని మోదీ కోల్‌కతాలోని రాజ్‌భవన్ సందర్శనకు కొద్ది గంటల ముందు ఆమె గవర్నర్‌పై ఆరోపణలు చేయడం గమనార్హం. అయితే.. వీటిని తీవ్రంగా ఖండిస్తూ రాజ్‌భవన్ వెంటనే వరుస ట్వీట్లు చేసింది. గవర్నర్ హౌస్ ప్రాంగణంలోని పోలీస్పోస్టులో ఈ వేధింపుల గురించి చెప్పినట్లు పోలీసులు తెలిపారు. దాంతో ఆమెను స్థానికంగా ఉన్న హరే స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు తరలించగా ఆమె అక్కడ ఫిర్యాదు చేశారు.
More Stories
సందడిగా దత్తాత్రేయ `అలయ్ బలయ్’
ఆర్ఎస్ఎస్ అంకితభావం, సేవకు అరుదైన ఉదాహరణ.. దలైలామా
భీమస్మృతి మనకు మార్గదర్శకం, మనుస్మృతి కాదు