మే 1న ఇంటి వద్దే పెన్షన్లు పంపిణీ చేయాలి

మే 1న ఇంటి వద్దే పెన్షన్లు పంపిణీ చేయాలి
మే 1న వృద్ధాప్య పెన్షన్లు అన్నింటిని ఇంటి వద్దనే ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఎన్డీఏ నేతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్  జవహర్ రెడ్డిని కోరారు. రాష్ట్ర సచివాలయంలో జవహర్ రెడ్డిని కలిసిన ఎన్డీఏ కూటమి నేతల బృందం వినతి పత్రం అందించారు. అనంతరం సచివాలయంలో ఆకస్మికంగా నిరసనకు దిగారు. 

దురుద్దేశ పూర్వక పింఛన్ల పంపిణీకి కాలయాపన చేస్తే, వృద్ధులకు ఏదైనా జరిగితే సీఎం జగన్, సీఎస్ జవహర్ రెడ్డి, సెర్ఫ్ సీఈఓ మురళీధర్ రెడ్డిలదే బాధ్యత అని వారు స్పష్టం చేశారు.  ఏప్రిల్ లో వైసిపి మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులకు సంబంధించిన రూ.13 వేల కోట్ల బిల్లులను ఖజానా ఖాళీచేసి చెల్లించారని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. 

ఏప్రిల్ 3వ తేదీ వరకు సచివాలయాల వద్ద పెన్షన్ దారులకు డబ్బులు చేరక 33 మంది లబ్ధిదారులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎస్ జవహర్ రెడ్డి దురుద్దేశపూర్వకంగా వైసీపీ పార్టీకి లబ్ది చేయాలని కొమ్ము కాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  టీడీపీ అధినేత చంద్రబాబు చీఫ్ ఎలక్షన్ కమిషన్ కు 24న లేఖ రాశారు. దానిపై 26వ తేదీ రాత్రి చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు వచ్చాయని చెప్పారు. ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేయకుండా మే 1న ఇంటి వద్దనే పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు.

“ఒక్కొక్క ఉద్యోగి 20 మందికి చొప్పున ప్రభుత్వ సచివాలయ ఉద్యోగులు నాలుగు లక్షల మంది ప్రతి ఇంటికి వెళ్లి సులభంగా పెన్షన్ ఇచ్చే అవకాశం ఉంది. శవ రాజకీయాలు చేస్తూ మంత్రి జోగి రమేష్చనిపోయిన వృద్ధురాలిని పార్టీ కార్యాలయం వద్దకు తీసుకురావాలని ప్రయత్నం చేశారు. అటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదు” అని హెచ్చరించారు. 

ఈ నెలలో 30వ తేదీ కల్లా పెన్షన్ డబ్బులను మ్యాపింగ్ చేసి, మే 1న 6 గంటలకల్లా ప్రతి ఇంటికి పంపించాలని డిమాండ్ చేశారు. . మానవతా దృక్పథంతో చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోకుండా దురుద్దేశపూర్వకంగా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి కాలయాపన చేసే కార్యక్రమం ఈరోజు కనపడిందని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

దురదృష్టకర సంఘటనలు పురావృతం అయితే దానికి సీఎం జగన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  జవహర్ రెడ్, సెర్ఫ్ సీఈవో మురళీధర్ రెడ్డి పూర్తి బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.