
లోక్‌సభ రెండో దశ ఎన్నికల పోలింగ్ శుక్రవారం ముగిసింది. 13 రాష్ర్టాల్లోని 88 లోక్‌సభ స్థానాలకు జరిగిన పోలింగ్‌లో రాత్రి 10 గంటల వరకు 64.2 శాతం ఓటింగ్ నమోదైంది. శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ జరిగింది. ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ఎన్నికల కమిషన్ వెల్లడించింది.
అయితే, మొదటి దశలో మాదిరిగా 2019 ఎన్నికల నాటికన్నా సుమారు 5 శాతం తక్కువగా పోలింగ్ జరిగింది. 2019లో రెండో దశలో 69.64 శాతం మేరకు జరిగింది. రాజస్థాన్ లో రెండో దశలో 13 స్థానాలను రాత్రి 11 గంటల వరకు 64.07 శాతం పోలింగ్ జరిగింది. 2019లో 68 శాతం పోలింగ్ జరిగింది.
మొత్తం 20 లోక్‌సభ స్థానాలకు శుక్రవారం ఎన్నికలు జరిగిన కేరళలో రాత్రి 11 గంటలకు 67.15% పోలింగ్ నమోదైంది, 2019లో 78% పోలింగ్ నమోదైంది. 28 స్థానాల్లో సగం ఉన్న కర్ణాటకలో శుక్రవారం రాత్రి 11 గంటలకు 68.38% పోలింగ్ నమోదైంది, అదే 14 స్థానాల్లో 2019లో 67% పోలింగ్ నమోదైంది. 2019లో 82.9% నమోదవగా, శుక్రవారం పోలింగ్ జరిగిన త్రిపురలో 79.59% పోలింగ్ నమోదైంది.
ఉత్తరప్రదేశ్‌లో 54.85 శాతం, బిహార్‌లో 55.08 శాతం పోలింగ్ జరిగింది. కేరళలోని మొత్తం 20 స్థానాలు, కర్ణాటకలో 14, రాజస్థాన్‌లో 13, మహారాష్ట్రలో 8, ఉత్తరప్రదేశ్‌లో 8, మధ్యప్రదేశ్‌లో 6, అస్సాంలో 5, బీహార్‌లో 5, ఛత్తీస్‌గఢ్‌లో 3, పశ్చిమ బెంగాల్లో 3, మణిపూర్‌లో 1, త్రిపురలో 1, జమ్ము కశ్మీర్లో 1 స్థానానికి రెండో దశలో పోలింగ్ జరిగింది.
ఎన్నికలు జరిగిన పలు ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించడం వల్ల ఓటింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. కేరళలో ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్న ఒక పోలింగ్ ఏజెంట్, ఓటేసిన ముగ్గురు ఓటర్లు ఎండ వేడి, అనారోగ్య వల్ల మరణించారు. ఛత్తీస్‌గఢ్‌లోని మహసముంద్‌లో ఎన్నికల భద్రతా విధుల్లో ఉన్న ఓ జవాన్ గన్‌తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
మణిపూర్‌లోని కల్లోలిత ప్రాంతాల్లో భారీ భద్రత మధ్య ఓటింగ్ జరిగింది. పలుచోట్ల మిలిటెంట్లు ఓటర్లను ఓటేయొద్దని బెదిరించారు. కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలోని ఇండిగనత గ్రామంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణతో పలు ఈవీఎంలు ధ్వంసమయ్యాయి. కాగా, బెంగళూరులోని ఓ ప్రైవేటు దవాఖానలో ఉన్న 41 మంది పేషెంట్లు ఓటు వేసేందుకు గ్రీన్ కారిడార్లు ఏర్పాటుచేసి ఆంబులెన్సుల్లో తీసుకెళ్లారు.
మతం పేరుతో ఓట్లడుగుతూ సోషల్ మీడియాలో వీడియో విడుదల చేసిన బెంగళూరు దక్షిణ బీజేపీ అభ్యర్థి తేజస్వీ సూర్యపై కేసు నమోదైంది. విద్వేష వ్యాఖ్యలు చేసి, ప్రజల మధ్య వైషమ్యాలు పెంచుతున్నారనే ఆరోపణలపై కర్ణాటకకు చెందిన సీనియర్ బీజేపీ నేత సీటీ రవిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.
కాగా, లోక్‌సభ ఎన్నికల ఐదో దశ నోటిఫికేషన్‌ను ఎన్నికల సంఘం శుక్రవారం జారీ చేసింది. బీహార్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జమ్ముకశ్మీర్, లఢక్‌లో ఈ దశలో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 49 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. అతి తక్కువ స్థానాల్లో ఓటింగ్ జరగనున్న దశ ఇదే. ఈ విడతలో మే 20న పోలింగ్ జరగనుంది.
More Stories
పాలస్తీనాను గుర్తించిన బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా
నేటి నుంచి అమల్లోకి జీఎస్టీ కొత్త శ్లాబులు
ఎల్టీటీఈ పునరుద్ధరణకు శ్రీలంక మహిళ ప్రయత్నం