చంద్రబాబుపై చర్యకు ఈసీకి సిఫార్స్

చంద్రబాబుపై చర్యకు ఈసీకి సిఫార్స్
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ రోజు దగ్గరపడుతోంది. మరో 20 రోజుల్లో అంటే మే 13వ తేదీన ఏపీలో ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. దీంతో పార్టీలన్నీ ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి షాక్ ఇచ్చేలా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా నిర్ణయం తీసుకున్నారు. 
 
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిపై చర్యల కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి ముకేష్ కుమార్ మీనా సిఫార్సు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద చేసిన వ్యాఖ్యలకు సంబంధించి చంద్రబాబు ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందని ఏపీ సీఈవో.. చర్యల కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫార్సు చేశారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం వైఎస్ జగన్, చంద్రబాబు పరస్పర విమర్శలు చేసుకున్నారు. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్తూనే వైరిపక్షాలపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఈ విమర్శల తీవ్రత పెరిగి అనుచిత వ్యాఖ్యలు చేసేవరకూ వెళ్లింది. ఈ క్రమంలోనే రెండు పార్టీల నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. 

 
దీంతో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాను కలిసి ఫిర్యాదు చేశాయి. రాజకీయ పార్టీల ఫిర్యాదులపై స్పందించిన ఏపీ సీఈవో వివరణ ఇవ్వాల్సిందిగా వైఎస్ జగన్, చంద్రబాబు ఇద్దరికీ నోటీసులు జారీ చేశారు.
 టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 18 సార్లు ఏపీ సీఈవోకు ఫిర్యాదు చేసింది. 
 
దీనిపై స్పందించిన ముకేష్ కుమార్ మీనా చంద్రబాబుకు నోటీసులు ఇవ్వగా ఆయన కొన్నింటికి వివరణ ఇచ్చారు. మరికొన్ని నోటీసులకు సమాధానం ఇవ్వనట్లు సమాచారం. ఈ క్రమంలోనే చంద్రబాబు వివరణపై సంతృప్తి చెందని ముకేష్ కుమార్ మీనా చంద్రబాబుపై చర్యలకు సిఫార్సు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.  ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్యకార్యదర్శి అవినాష్ కుమార్‌కు లేఖ రాసిన మీనా  చంద్రబాబు వ్యాఖ్యల తాలూకూ వీడియోలను కూడా జతచేశారు.