పోలీసుల తీరుపై మాధవీలత అసహనం

* బీజేపీ ఎంపీ అభ్యర్ధికి హగ్.. మహిళా ఏఎస్‌పై వేటు

హైదరాబాద్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత.. నగర వీధుల్లో పర్యటిస్తూ ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు. తన ప్రత్యర్థి అయిన ఎంఐఎం అధినేత, సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై ఘాటు విమర్శలు చేస్తూ.. ఈసారి హైదరాబాద్‌లో ఎగిరేది బీజేపీ జెండానే అంటూ దీమా వ్యక్తం చేస్తున్నారు.  ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ మాధవీలత సభలు నిర్వహిస్తున్నారు.

నగరంలోని కొన్ని ప్రాంతాలు సున్నితమైనవిగా ఉండగా.. ఆ ప్రాంతాల్లో బీజేపీ నిర్వహిస్తున్న ప్రచారంలో భారీగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు. ఈ క్రమంలోనే మాధవీలత పాల్గొన్న సభకు బందోబస్తుగా సైదాబాద్ ఏఎస్‌ఐ ఉమాదేవి వచ్చారు. ఆ సమయంలో మాధవీలతను చూసిన ఉమాదేవి చిరునవ్వుతో పలకరించటమే కాకుండా, ఆమెను ఆలింగనం చేసుకుంది. దీంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

డ్యూటీలో ఉన్న ఓ పోలీసు అధికారి ఓ పార్టీకి చెందిన అభ్యర్థిని ఇలా ఆలింగనం చేసుకుని వ్యవహరించటం ఎన్నికల కోడ్ ఉల్లంఘించటం కిందికే వస్తుందని భావించిన పోలీస్ ఉన్నతాధికారులు ఉమాదేవిపై వేటు వేశారు. ఉమాదేవిని సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

ఇప్పటికే.. శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన మాధవీలత సిద్ధి అంబర్‌ బజార్‌ మీదుగా వెళ్తున్న సమయంలో మసీదును చూస్తూ విల్లు ఎక్కుపెట్టినట్టుగా వ్యవహరించిన తీరుపై దుమారం చెలరేగింది. ఇదే అంశంపై మహ్మద్ షేక్ ఇమ్రాన్ అనే వ్యక్తి బేగంబజార్‌ పోలీస్ స్టేషన్‌లో లిఖితపూరకంగా ఫిర్యాదు చేశారు. 

మాధవీలత ప్రవర్తన మైనారిటీల మనోభావాలను కించపరిచేలా ఉందని, ఆమెపై చట్టపరమైన చర్యలను తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు బేగంబజార్ పోలీసులు మాధవీలతపై క్రిమినల్ కేసు పెట్టారు. ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

కాగా, మాధవీలత పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. పోలీసులు ఎన్నికల కమిషన్ పరిధిలో పనిచేస్తున్నారా? లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పు చేతలో ఉన్నారా? అంటూ ఆమె మండిపడ్డారు. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశంపై ఎన్నికల ముఖ్య అధికారి వికాస్ రాజ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.

‘ఎన్నికల వేళ అసదుద్దీన్ తీరు సరిగా లేదు. హిందువుల బాధపడేలా మాట్లాడుతున్నారు. బీఫ్ జిందాబాద్ అని ప్రచారం చేయడం సరికాదు. ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టేలా వ్యవహరించడం మంచిది కాదు. మతాల మధ్య చిచ్చు పెట్టే కుట్ర చేస్తున్నారు. అసదుద్దీన్ ఒవైసీపై చర్యలు తీసుకోండి’ అని ఆమె డిమాండ్ చేశారు.

అదేవిధంగా, తాను మసీదుపై గురిపెట్టి బాణం వేయలేదని ఆమె స్పష్టం చేశారు. ఆ సమయంలో కెమెరాను తిప్పారని అంటూ విచారణ చేపట్టకుండా పోలీసులు తనపై కేసు నమోదు చేశారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు ఈసీ పరిధిలో పనిచేస్తున్నారా? అనే సందేహాం కలిగిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నారా అనే అనుమానం కలుగుతుందని ఆమె తెలిపారు. పోలీసుల తీరుపై అనుమానాలు ఉన్నాయని చెబుతూ ఎలక్షన్ కమిషన్ వారిపై దృష్టి సారించాలని మాధవీలత సీఈవో వికాస్ రాజ్‌ను కోరారు.