కేజ్రీవాల్, క‌విత జ్యుడిషియ‌ల్ క‌స్ట‌డీ పొడిగింపు

మ‌ద్యం కుంభ‌కోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌, బిఆర్ఎస్ ఎమ్యెల్సీ కవిత లకు మరో 14 రోజుల పాటు జ్యుడిషియ‌ల్  క‌స్ట‌డీని పొడిగించారు. రౌజ్ అవెన్యూ కోర్టు క‌స్ట‌డీని పొడిగిస్తూ ఇవాళ ఆదేశాలు జారీ చేసింది. ఎక్సైజ్ పాల‌సీతో లింకున్న ఈడీ కేసులో కేజ్రీవాల్‌తో పాటు బీఆర్ఎస్ నేత క‌విత‌, చ‌న్‌ప్రీత్ సింగ్‌కు క‌స్ట‌డీని పొడిగించారు.
 
 తీహార్ జైలులో ఉన్న నిందితుల్ని రిమాండ్ ముగియ‌డంతో మంగళవారం  సీబీఐ ప్ర‌త్యేక జ‌డ్జి కావేరి బ‌వేజా ముందు  వ‌ర్చువ‌ల్‌గా హాజరు పరిచయరు. వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా నిందితులు విచార‌ణ ఎదుర్కొన్నారు.   మే 7 వ తేదీన కేజ్రీవాల్, కవితలను కోర్టు ఎదుట హాజరుపరచాలని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి ఆదేశాలు జారీ చేశారు. దీంతో మరో 14 రోజుల పాటు అరవింద్ కేజ్రీవాల్, కల్వకుంట్ల కవిత తీహార్ జైలులోనే ఉండనున్నారు.
 
కవిత కస్టడీ పొడిగించాలంటూ ఇటు ఈడీ, అటు సీబీఐ కోరడంతో కోర్టు అందుకు అంగీకరించింది. ఈ క్రమంలో కేసు దర్యాప్తు పురోగతిని ఈడీ కోర్టుకు అందజేసింది.  అంతేకాదు 60 రోజుల్లో కవిత అరెస్ట్‌ పై చార్జిషీట్‌ సమర్పిస్తామని ఈ సంద్భంగా ఈడీ కోర్టుకు తెలిపింది. మే 7వ తేదీ వ‌ర‌కు క‌విత జ్యుడిషియ‌ల్ క‌స్ట‌డీని పొడిగించారు.

ఇక ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీలాండరింగ్‌ ఆరోపణలపై మార్చి 21 వ తేదీన ఈడీ అధికారులు.. తనను అరెస్టు చేయాడాన్ని సవాల్‌ చేస్తూ కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌ సుప్రీంకోర్టులో ప్రస్తుతం పెండింగ్‌లో ఉంది. ఈ వ్యవహారంపై ఏప్రిల్‌ 15 వ తేదీన విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. దీనిపై ఈడీని వివరణ కోరింది. ఈడీ అధికారులు వివరణ ఇచ్చేవరకు కేజ్రీవాల్‌కు తక్షణ ఉపశమనం కల్పించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.