
దేశవ్యాప్తంగా ఎంపీ, ఎమ్మెల్యేలపై నమోదైన క్రిమినల్ కేసుల పరిష్కారం మందకొడిగా సాగుతోంది. వీటి కోసం ఏర్పాటైన ప్రత్యేక కోర్టులు గత ఏడాది 2,018 కేసుల్లో తీర్పులు వెలువరించాయి. ఈ విషయం సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో వెల్లడయింది. ఎంపీ, ఎమ్మెల్యేలపై నమోదైన క్రిమినల్ కేసులను త్వరగా పరిష్కరించేలా ఆదేశించాలని కోరుతూ న్యాయవాది అశ్విన్ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిల్‌పై విచారణ సందర్భంగా అమిక్‌సక్యూరీగా వ్యవహరిస్తున్న సీనియర్ న్యాయవాది విజయ్ హన్సారియా ఈ అఫిడవిట్‌ను సమర్పించారు.
ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో కూడా క్రిమినల్ కేసులు ఉన్నవారు రంగంలో ఉన్నందున కేసుల సత్వర విచారణపై దృష్టి పెట్టాల్సి ఉందని తెలిపారు. మొదటి రెండు దశల ఎన్నికల్లో 2,810 మంది పోటీ చేస్తుండగా అందులో 501 మంది (18ు)పై క్రిమినల్ కేసులు ఉన్నాయని తెలిపారు. వీరిలో 327 మంది (12 శాతం)పై అయిదేళ్ల కన్నా ఎక్కువ కాలం పాటు శిక్షలు పడే తీవ్రమైన కేసులు ఉన్నాయని వివరించారు.
క్రిమినల్ కేసులు ఉన్నవారు గణనీయ సంఖ్యలోనే ఎన్నికవుతున్నందున కేసుల సత్వర పరిష్కారానికి మరిన్ని ఆదేశాలు ఇవ్వాల్సి ఉంటుందని ఆ అఫిడవిట్‌లో సూచించారు. 2023 జనవరి ఒకటో తేదీ నాటికి మొత్తం 4,697 కేసులు పెండింగ్‌లో ఉండగా ఆ ఏడాది మొత్తం మీద ప్రత్యేక కోర్టులు 2,018 కేసులను పరిష్కరించాయి. కొత్తగా 1,746 కేసులు రావడంతో పెండింగ్ కేసుల సంఖ్య మళ్లీ 4,474కు పెరిగింది.
మొత్తం 1,300 కేసుల్లో 766 కేసులను పరిష్కరించి ఉత్తరప్రదేశ్‌లోని కోర్టులు సంఖ్యాపరగా మొదటి స్థానంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేసుల పరిష్కారంపై హైకోర్టులు మరింత నిశితంగా పర్యవేక్షించాల్సి ఉంటుందని అమిక్‌సక్యూరీ హన్సారియా తన అఫిడవిట్‌లో సూచించారు. మూడేళ్ల కంటే ఎక్కవకాలంపాటు కేసులు పెండింగ్‌లో ఉంటే అందుకుగల కారణాలను వివరిస్తూ ఎంపీ/ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టుల జడ్జీల నుంచి హైకోర్టులు నివేదిక కోరాల్సి ఉంటుందని సిఫార్సు చేశారు.
హైకోర్టులు ప్రతి కేసును సూక్ష్మ స్థాయిలో పరిశీలించి విచారణ త్వరగా పూర్తయ్యేలా సూచనలు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. ఈ కేసుల కోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్ రూపొందించేలా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇందుకోసం సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉంటుందని తెలిపారు.
మూడేళ్లకుపైగా పెండింగ్‌లో ఉన్న కేసులపై తెలంగాణ, అలహాబాద్, ఢిల్లీ, పంజాబ్-హరియాణా, త్రిపుర హైకోర్టులు సూక్ష్మస్థాయి పరిశీలన జరిపి దర్యాప్తు పురోగతిని తెలుసుకున్నాయని హన్సారియా తెలిపారు. తగిన ఉత్తర్వులు కూడా ఇచ్చాయని పేర్కొన్నారు. మిగిలిన హైకోర్టులు మాత్రం పెండింగ్ కేసుల సమాచారాన్ని తెలుసుకున్నాయని వివరించారు.
More Stories
ఢిల్లీలో బిజెపి సునామి.. యాక్సిస్ మై ఇండియా అంచనా
2027లో చంద్రయాన్-4 మిషన్ ప్రయోగం
ఛత్తీస్గడ్లో మరో నలుగురు మావోలు మృతి