కన్నడలో మాట్లాడినందుకు ఓ నటిపై దాడి

కన్నడలో మాట్లాడినందుకు ఓ నటిపై దాడి

కన్నడలో మాట్లాడినందుకు తనపై, కుటుంబంపై కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారని కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన నటి  హర్షికా పూనాచా ఆవేదన వ్యక్తం చేశారు. దాడికి పాల్పడ్డ నిందితులపై చర్యలు తీసుకోవాలని కర్ణాటక ముఖ్యమంత్రితో పాటు పోలీసులను ఆమె కోరారు. దాడి ఘటనతో బెంగళూరు వీధుల్లోకి రావాలంటేనే భయమవుతోందని ఆమె పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆమె సోషల్‌ మీడియా అకౌంట్‌లో దాడికి సంబంధించిన వీడియోలను ఆమె షేర్‌ చేశారు. ఇటీవల ఆమె కుటుంబంతో కలిసి పులికేశి నగర్‌లోని మసీదు రోడ్‌లోని ఓ రెస్టారెంట్‌లోకి భోజనానికి వెళ్లారు. భోజనం అయ్యాక రెస్టారెంట్‌లో నుంచి కారు వద్దకు వచ్చారు. 

అదే సమయంలో అక్కడికి వచ్చిన ఇద్దరు వ్యక్తులు వాగ్వాదానికి దిగారని, ఆ తర్వాత 20 నుంచి 30 మంది వరకు చేరుకొని తన భర్త భువన్ పొన్నన్న ముఖంపై దాడికి ప్రయత్నించడంతో పాటు బంగారం గొలుసును లాక్కునేందుకు యత్నించినట్లు  హర్షికా తెలిపారు. వారి ప్రయత్నం ఫలించకపోవడంతో వారు కారుపై దాడి చేయడం మొదలుపెట్టారని, తన భర్తను శారీరకంగా హింసించే ప్రయత్నం చేశారని ఆమె ఆరోపించారు.

 తమ కారులో మహిళలు, కుటుంబ సభ్యులు ఉండడంతో ఆయన ఎదురుదాడికి దిగలేదని ఆమె పేర్కొన్నారు. కన్నడ భాష మాట్లాడేవారికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారని తెలిపారు. అయితే, రాష్ట్రంలో ఎందరో మహిళలు, ఎన్నో కుటుంబాలు ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు చూస్తుంటే మనం పాకిస్థాన్‌, ఆఫ్ఘనిస్థాన్‌లో ఉన్నామా? అనే అనుమానం వస్తోందంటూ ఆమె వాపోయారు. 

సొంత రాష్ట్రంలో కన్నడ మాట్లాడడం కూడా తప్పేనా? అని హర్షికా ప్రశ్నించారు. ఈ దాడి ఘటనపై పలువురు నేతలు ప్రశ్నించారు. బీజేపీ నేత, ప్రతిపక్ష నేత ఆర్.  అశోక కాంగ్రెస్‌ సర్కారుపై ఈ సందర్భంగా విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉండగా.. హర్షికా పూనాచా తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించారు. ‘ఏడుకొండలవాడ వెంకటరమణ అందరూ బాగుండాలి’.. ‘అప్పుడలా.. ఇప్పుడిలా’ చిత్రాల్లో నటించింది.