పాక్ కు మిస్సైల్ టెక్నాలజీ ఇచ్చిన చైనా కంపెనీల‌పై ఆంక్ష‌లు

పాకిస్థాన్‌కు ర‌హ‌స్యంగా బాలిస్టిక్ క్షిప‌ణి టెక్నాల‌జీని అంద‌జేసిన‌ మూడు చైనీస్ కంపెనీల‌పై అమెరికా ఆంక్ష‌లు విధించింది. మూడు చైనా కంపెనీలను, ఓ బెలాసర్‌ కంపెనీపై అమెరికా నిషేధించింది. పాకిస్థాన్‌కు బాలిస్టిక్ క్షిపణి విడిభాగాలను అందించినందుకు ఆయా కంపెనీలపై బ్యాన్‌ విధిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్‌ తెలిపారు.

నిషేధం విధించిన కంపెనీల జాబితాలో చైనాకు చెందిన లాంగ్‌డే టెక్నాలజీ డెవలప్‌మెంట్ కీ, టియాంజిన్ క్రియేటివ్ సోర్స్ ఇంటర్నేషనల్ ట్రేడ్, గ్రాన్‌పెక్ట్ కంపెనీ లిమిటెడ్ ఉన్నాయి. మిన్స్క్ వీల్ ట్రాక్టర్ ప్లాంట్ కంపెనీ ఆఫ్ బెలారస్ ఉన్నది. లాంగ్ రేంజ్ మిస్సైల్ టెక్నాల‌జీని కూడా పాక్‌కు ఇచ్చిన‌ట్లు చైనా కంపెనీల‌పై ఆరోప‌ణ‌లు ఉన్నాయి.  

ఈ నాలుగు కంపెనీలు పాకిస్థాన్ బాలిస్టిక్ క్షిపణి కార్యకలాపాలకు సహాయం చేస్తున్నట్లుగా ఆరోపణలున్నాయి. విధ్వంసక ఆయుధాల విస్తరణలో ఈ కంపెనీలు పాల్గొన్నట్లు గుర్తించామని, దాంతో చర్యలు తీసుకున్నట్లు మాథ్యూ మిల్లర్ పేర్కొన్నారు. బెలారస్ కంపెనీ మిన్స్క్ వీల్ ట్రాక్టర్ ప్లాంట్ కంపెనీ పాకిస్థాన్ బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమం కోసం స్పెషల్‌ వెహికిల్‌ ఛాసిస్‌ను అందజేస్తోందని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది.

దీన్ని బాలిస్టిక్‌ క్షిపణుల్లో ఉపయోగిస్తారన్నారు. చైనా కంపెనీ గ్రాన్‌పెక్ట్ కంపెనీ లిమిటెడ్ ఫిలమెంట్ వైండింగ్ మెషీన్‌లను అందజేస్తోందని యుఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ తెలిపింది.ఈ కంపెనీలు మాన‌వ హ‌న‌న ఆయుధాల త‌యారీ వ్యాప్తికి కార‌ణం అవుతున్నాయ‌ని, అయితే ఒక‌వేళ పాకిస్థాన్ ఆ ఆయుధాల త‌యారీ, ర‌వాణాకు పాల్ప‌డితే స‌మ‌స్య‌గా మారే ప్ర‌మాదం ఉంద‌ని  మాథ్యూ మిల్ల‌ర్ తెలిపారు.

పాకిస్థాన్‌కు మిత్ర‌దేశ‌మైన చైనా.. ప్ర‌ధానంగా ఆయుధాలు, ర‌క్ష‌ణ ఉత్ప‌త్తుల‌ను స‌ర‌ఫ‌రా చేస్తున్న‌ది.  పాకిస్థాన్ లాంగ్ రేంజ్ బాలిస్టిక్‌ మిస్సైల్‌కు కావాల్సిన వెహిక‌ల్ ఛాసిస్‌ను మిన్స్క్ వీల్ ట్రాక్ట‌ర్ ప్లాంట్ స‌ర‌ఫ‌రా చేస్తున్న‌ది. మిస్సైల్‌కు చెందిన ఫిల్మెంట్ వైండింగ్ మెషీన్‌ను చైనాకు చెందిన లాంగ్డే కంపెనీ స‌ర‌ఫ‌రా చేస్తున్న‌ది. ఫిల్మెంట్ వైండింగ్ మెషీన్ల ద్వారా రాకెట్ మోటార్ కేసుల్ని ఉత్ప‌త్తి చేస్తారు. తంజిన్ సంస్థ స్టిర్ వెల్డింగ్ ఎక్విప్మెంట్‌ను స‌ర‌ఫ‌రా చేస్తోంది.

వీటిని రాకెట్ మోటార్‌లో ఉపయోగిస్తారు. టియాంజిన్ క్రియేటివ్ సోర్స్ ఇంటర్నేషనల్ ట్రేడ్ కంపెనీ లిమిటెడ్ వెల్డింగ్ సంబంధిత ఉపకరణాలు, యాక్సిలరేటర్ సిస్టమ్‌లను సరఫరా చేస్తుంది. టియాంజిన్ కంపెనీకి చైనా సైన్యంతో కూడా సంబంధాలున్నట్లు తేలింది. నిషేధం కింద అమెరికాలోని ఈ కంపెనీల ఆస్తులను జప్తు చేయనున్నారు. కంపెనీ యజమాని, ప్రధాన వాటాదారులపై సైతం నిషేధం ఉంటుంది