నెస్లేపై విచారణకు ఆదేశించిన కేంద్రం

 నెస్లేపై విచారణ చేపట్టాల్సిందిగా ఆహార భద్రతా నియంత్రణ సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ)ని కేంద్రం శుక్రవారం తెలిపింది. నెస్లే చిన్నారుల ఆహార ఉత్పత్తుల నివేదికను పరిశీలించాల్సిందిగా ఫస్సీకి లేఖ రాసినట్లు వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది.  చిన్నారుల ఆహార ఉత్పత్తుల్లో అత్యధిక చక్కెరలు వారి ఆరోగ్యం, భద్రతపై తీవ్ర ప్రభావం చూపుతుందని వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి, సెంట్రల్‌ కన్జ్యూమర్‌ ప్రొటెక్షన్‌ అథారిటీ (సిసిపిఎ) చీఫ్‌ నిధి ఖారే తెలిపారు. 

దేశ ప్రజల ముఖ్యంగా చిన్నారుల, శిశువుల ఆరోగ్యం, శ్రేయస్సు అత్యంత ముఖ్యమని, భద్రతా ప్రమాణాల ఉల్లంఘన తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. నివేదికపై విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా  ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐని ఆదేశించినట్లు తెలిపారు.

నెస్లేపై స్విట్జర్లాండ్ కు చెందిన స్వచ్ఛంద సంస్థ పబ్లిక్‌ ఐ నివేదికపై నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చైల్డ్‌ రైట్స్‌ (ఎన్‌సిపిసిఆర్‌) కూడా ఫస్సీకి నోటీసులు జారీ చేసింది. ఆసియా,  ఆఫ్రికా,  లాటిన్ అమెరికా దేశాలలో నెస్లే విక్రయించే చిన్నారుల ఆహార ఉత్పత్తుల్లో అధిక మొత్తంలో చక్కెరలు ఉంటున్నట్లు  స్విస్ ఎన్‌జిఒ పబ్లిక్ ఐ తన నివేదికలో వెల్లడించిన సంగతి తెలిసిందే.

ఆరు నెలల శిశువుల కోసం ఉపయోగించే నెస్లే గోధుమ ఆధారిత ఉత్పత్తి అయిన సెరెలాక్‌లో భారతదేశంలో ప్రతి సర్వింగ్‌కు 2.7 గ్రాముల అదనపు చక్కెర ఉందని నివేదిక పేర్కొంది. అయితే, నెస్లే కంపెనీ జర్మనీ, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ , ఇంగ్లాండ్  వంటి ఇతర దేశాలలో ఇటువంటి పద్ధతులను పాటించడం లేదు. 
 
బేబీ ఉత్పత్తులలో చక్కెర అధికంగా ఉండటం వల్ల దేశంలోని బాలలకు ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. అనేక పేద దేశాలలో విక్రయించే శిశువుల పాలు, తృణధాన్యాల ఉత్పత్తులకు కంపెనీ చక్కెర, తేనెను కలుపుతుందని సూచించిన నివేదిక కలకలం రేపడంతో నెస్లే ఇండియా షేర్లు సుమారు 5 శాతం పడిపోయాయి.