సరబ్‌జిత్‌ సింగ్‌ హంతకుడు పాక్‌లో హతం

సరబ్‌జిత్‌ సింగ్‌ హంతకుడు పాక్‌లో హతం
భారతీయ ఖైదీ సరబ్‌జిత్‌ సింగ్‌ ను దారుణంగా చంపిన అమీర్‌ సర్ఫరాజ్‌ తంబా పాకిస్థాన్‌లో హతమయ్యాడు. ఆదివారం లాహోర్‌లోని ఇస్లాంపుర ప్రాంతంలో బైక్‌పై వచ్చిన దుండగులు అతడిపై కాల్పులు జరిపారు. ముంబై ఉగ్రదాడికి సూత్రధారి హఫీజ్ సయీద్‌కు సన్నిహితుడైన తంబాను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. 
 
సరబ్‌జిత్‌ సింగ్‌పై దాడి కేసులో నిందితులైన అమీర్‌ సర్ఫరాజ్‌ తంబా, ముదస్సర్‌ను నిర్దోషులుగా పాకిస్థాన్‌ కోర్టు విడుదల చేసింది. అయితే విడుదలైన ఆరేళ్ల తర్వాత ఆదివారం గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపి తంబాను హత్య చేశారు.
 
కాగా, పంజాబ్‌లోని భిఖివింద్‌కు చెందిన సరబ్‌జిత్ సింగ్ మద్యం మత్తులో పొరపాటున పాకిస్థాన్‌లోకి ప్రవేశించాడు. గూఢచర్యానికి పాల్పడినట్లు, 1990లో పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో జరిగిన బాంబు పేలుళ్లలో అతడి ప్రాత ఉందని ఆరోపించిన పాక్‌ కోర్టు మరణశిక్ష విధించింది. అయితే ఈ ఆరోపణలను భారత్‌ ఖండించింది.మరోవైపు 2013 ఏప్రిల్‌ నెలాఖరులో లాహోర్‌లోని కోట్ లఖ్‌పత్ జైలులో ఉన్న సరబ్‌జిత్ సింగ్‌పై కొందరు ఖైదీలు ఇటుకలు, ఐరాన్‌ రాడ్‌లతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడి వారం రోజులు ఆసుపత్రిలో కోమాలో ఉన్న అతడు మే 2 గుండెపోటుతో మరణించాడు.

సుమారు 23 ఏళ్లు పాకిస్థాన్‌ జైలులో మగ్గిన సరబ్‌జిత్‌ సింగ్‌ విడుదల కోసం అతడి సోదరి దల్బీర్ కౌర్ ఎంతగానో పోరాడింది. పాక్‌కు వెళ్లిన ఆమె జైలులో సోదరుడ్ని కలిసింది. 2022 జూన్‌ 26న ఆమె చనిపోయింది. దల్బీర్ కౌర్  పోరాటం ఆధారంగా రణదీప్ హుడా, ఐశ్వర్యారాయ్ నటించిన ‘సరబ్‌జిత్‌’  హిందీ సినిమా 2016లో విడుదలైంది.