వియ‌త్నాం ప్రాప‌ర్టీ టైకూన్ మై లాన్‌కు మ‌ర‌ణ‌శిక్ష

మన దేశంలో ఆర్థిక నేరాలు చేస్తూ వందలు, వేల కోట్లు బ్యాంకుల వద్ద రుణాలు తీసుకుని వాటిని ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వారి జాబితా పెద్దగానే ఉంది. అయితే వారి ఆస్తులను వేలం వేయడం, ఇతర దేశాలకు పారిపోయిన వారిని తిరిగి దేశానికి రప్పించేందుకు ప్రభుత్వాలు అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నా అవి ఫలించడం లేదు. 

ఇక వారిపై నమోదైన కేసులు ఏళ్లు గడుస్తున్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్న చందంగా తయారవుతోంది. తాజాగా వియాత్నంలో ఏకంగా లక్ష కోట్ల విలువైన మోసం కోర్టులో రుజువు కావడంతో ఓ బిజినెస్ ఉమెన్‌కు మరణశిక్ష పడింది. వియత్నాంలోని దిగ్గజ వ్యాపారవేత్తల్లో ఒకరైన ట్రూంగ్‌ మై లాన్‌ (66) ఏకంగా 12.5 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో ఏకంగా రూ. లక్ష కోట్ల కుంభకోణం చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. 

వాన్‌ థిన్‌ ఫాట్‌ అనే రియల్‌ ఎస్టేట్‌ సంస్థకు ఛైర్ పర్సన్‌గా ఉన్న ట్రూంగ్ మై లాన్  బ్యాంకులను మోసం చేసిన కేసులో దోషిగా తేలారు. దీంతో ఆమెకు వియత్నాం కోర్టు మరణశిక్షను విధించింది. వియత్నాంలోని సైగాన్‌ కమర్షియల్‌ బ్యాంకు-ఎస్‌సీబీలో ట్రూంగ్‌ మై లాన్‌కు దాదాపు 90 శాతం వాటా ఉంది. 

అయితే గత కొన్నేళ్లుగా ఈ సైగాన్ కమర్షియల్ బ్యాంకులో ట్రూంగ్ మై లాన్ భారీగా ఆర్థిక మోసాలకు పాల్పడ్డారు. 2018 నుంచి 2022 మధ్య ఏకంగా 916 నకిలీ పత్రాలు సృష్టించి బ్యాంకు నుంచి 304 ట్రిలియన్‌ డాంగ్‌ (వియత్నాం కరెన్సీ)లు తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. అంటే మన భారత కరెన్సీలో వీటి విలువ రూ.లక్ష కోట్లు ఉంటుంది.

అయితే మోసం మొత్తం విలువ దాదాపు 27 బిలియ‌న్ల డాల‌ర్లు ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఈ మొత్తం ఆ దేశ జీడీపీలో ఆరు శాతం అని తేలింది. ఈ మోసం కేసులో అనేక మంది అధికారులు కూడా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. హాంగ్‌కాంగ్‌కు చెందిన సంప‌న్న వ్యాపార‌వేత్త ను మిలాన్ పెళ్లి చేసుకున్న‌ది. అయితే అత‌ను కూడా ఈకేసులో విచార‌ణ ఎదుర్కొంటున్నారు.

2019- 2022 మధ్య ట్రూంగ్ మై లాన్ డ్రైవర్‌  సైగాన్ కమర్షియల్ బ్యాంక్ హెడ్‌క్వార్టర్స్‌ నుంచి 4.4 బిలియన్‌ డాలర్ల నగదును ఆమె నివాసానికి తరలించినట్లు అధికారులు గుర్తించారు. ఈ భారీ మోసం 2022లోనే బయటపడింది. దీంతో వెంటనే ట్రూంగ్ మై లాన్‌ను 2022 అక్టోబరులో పోలీసులు అరెస్టు చేశారు. అప్పటినుంచి విచారణ జరుగుతుండగా తాజాగా వియత్నాం కోర్టు తుది తీర్పు వెలువరించింది.  ఆమె వేలకొలది బినామీ కంపెనీలను సృష్టించి, అధికారులకు ముడుపులు చెల్లించి, బ్యాంకింగ్ నిబంధనలను ఉల్లంఘించారని నేరారోపణ చేశారు.