![సిఐడి కార్యాలయం ఆవరణలో పత్రాల దగ్ధం దుమారం సిఐడి కార్యాలయం ఆవరణలో పత్రాల దగ్ధం దుమారం](https://nijamtoday.com/wp-content/uploads/2024/04/Heritej.jpeg)
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమయంలో తాడేపల్లి సిట్ కార్యాలయం ఆవరణలో సోమవారం పలు పత్రాలను సిబ్బంది దహనం చేయడం కలకలం రేపింది. కాంపౌండ్ లో దహనం చేసిన పత్రాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అవి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో సిట్ స్వాధీనం చేసుకున్న హెరిటేజ్ కు సంబంధించిన కీలక డాక్యుమెంట్లు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది. దీనిపై తెలుగుదేశం పార్టీ తీవ్రస్థాయిలో విరుచుకు పడుతుంది.
వైసిపి ప్రభుత్వం అధికారంలోకి రాదని తేలడంతో ఫైళ్లు దగ్ధం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. ఇక ఈ ఘటనపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పత్రాలు తగలబెడితే మీరు చేసిన పాపాలు పోతాయా అంటూ ప్రశ్నించారు. నేర పరిశోధనపై దృష్టి సారించాల్సిన ఏపీ సిఐడి జగన్ పుణ్యమా అని క్రైమ్ ఇన్వాల్వ్మెంట్ డిపార్ట్మెంట్ గా మారిపోయిందని అంటూ ధ్వజమెత్తారు.
హెరిటేజ్ ఫుడ్స్ కు సంబంధించిన పత్రాలు తగలబెట్టారని అసత్య ప్రచారాలు చేస్తున్నారని సీఐడీ ఆరోపించింది. ఈ కేసులో నిందితుల నేరాన్ని రుజువు చేయడానికి తగిన సాక్ష్యాధారాలను ట్రయల్ కోర్టు ముందు ఉంచామని స్పష్టం చేశారు. ఈ కేసులో హెరిటేజ్ ఫుడ్స్‌కు సంబంధించి ఐటీ రిటర్న్‌లు తాము సీఆర్పీసీ ప్రోవిజన్ల ప్రకారం అధికారికంగానే తీసుకువచ్చామని తెలిపారు. ఈ కేసులో మిగతా ఆధారాలు కూడా చట్టప్రకారమే తీసుకున్నామని పేర్కొన్నారు.
కాగా, హెరిటేజ్ పత్రాలు దగ్ధంపై మీడియాలో వచ్చిన కథనాలపై హెరిటేజ్ కంపెనీ సెక్రటరీ ఉమాకాంత్ బారిక్ స్పందిస్తూ ఈ ఘటను సంబంధించి సీఐడీ అడిషనల్ ఎస్పీకి లేఖ రాశారు. సీఐడీ కస్టడీలో ఉన్న తమ ఒరిజినల్ డాక్యుమెంట్లు, మినిట్ పుస్తకాలను తాము అధికారుల కోరిక మేరకు ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. హెరిటేజ్‌కు సంబంధించిన పత్రాలను దగ్ధం చేసినట్లు సోషల్ మీడియా, టీవీ వార్తల్లో వచ్చిన అంశాన్ని ప్రస్తావిస్తూ తాము ఇచ్చిన డాక్యుమెంట్లు చాలా కీలకమైనవని పేర్కొన్నారు.
మీడియాలో వచ్చిన కథనాలు సీఐడీ కస్టడీలో ఉన్న తమ డాక్యుమెంట్ల భద్రతను ప్రశ్నార్ధకం చేసే విధంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ దీనిపై తమకు పూర్తిస్థాయి పరిస్థితిని వివరించాలని, తమకు పూర్తిస్థాయి వివరాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
More Stories
ఆరు నెలల్లో ఏపీకి కేంద్రం రూ 3 లక్షల కోట్ల సాయం
జగన్ ప్యాలస్ లపై ఆరా తీసిన అమిత్ షా
ఎన్కౌంటర్లో మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి దామోదర్ మృతి