
ఎన్నికల వేళ తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. లోక్‌సభ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో తలమునకలై ఉన్న ఆయన ఉండగా, ఆయన కుమారుడు పొంగులేటి హర్షా రెడ్డికి సమన్లు, నోటీసులు అందాయి. చెన్నై కస్టమ్స్ విభాగం అధికారులు హర్షారెడ్డికి ఈ సమన్లను జారీ చేశారు.
స్మగ్లింగ్ వ్యవహారమే దీనికి కారణం. కోట్లాది రూపాయల విలువ చేసే అత్యాధునిక గడియారాల స్మగ్లింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలను ఎదుర్కొంటోన్నారు పొంగులేటి హర్ష రెడ్డి. సరైన డాక్యుమెంట్స్ లేకుండా వాటిని దిగుమతి చేసుకున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఈ నెల 4వ తేదీ నాడు విచారణకు హాజరుకావాలంటూ హర్షారెడ్డిని ఆదేశించారు కస్టమ్స్ అధికారులు. తాను డెంగ్యూ జ్వరం బారిన పడ్డానంటూ ఒక్కరోజు ముందు అంటే ఈ నెల 3వ తేదీన వారికి లేఖ రాశారు. జ్వరం నుంచి కోలుకోవడానికి సమయం పడుతుందని తెలిపారు.
ఈ నెల 27వ తేదీ తరువాత విచారణకు హాజరు కావడానికి అంగీకరించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. హాంకాంగ్‌కు చెందిన ప్రవాస భారతీయుడు మహ్మద్ ఫహీరుద్దీన్ ముబీన్ నుంచి రెండు లగ్జరీ వాచీలు- పాటెక్ ఫిలిప్ 5740, బ్రెగ్యుట్ 2759 స్వాధీనం చేసుకున్నారు. ఫిబ్రవరి 5వ తేదీన కస్టమ్స్ అధికారులు అతనిపై స్మగ్లింగ్ కేసును బుక్ చేశారు. ఆ వాచీల విలువ 1.73 కోట్ల రూపాయలుగా అంచనా వేశారు.
ఈ కేసులో మధ్యవర్తిగా వ్యవహరించిన నవీన్ కుమార్‌ను కూడా కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. అతన్ని విచారించగా ఈ రెండు వాచీలను కూడా పొంగులేటి హర్షా రెడ్డి కోసం అక్రమంగా భారత్‌కు తీసుకొచ్చినట్లు తేలింది. ఈ రెండు వాచీలకు అయ్యే ఖర్చు మొత్తాన్ని హవాలా రూపంలో చెల్లింపులు జరిపినట్లు కస్టమ్స్ అధికారులు నిర్ధారించినట్లు తెలుస్తోంది.
More Stories
తెలంగాణలో నడుస్తున్నది రేవంతుద్దీన్ సర్కారు
హైదరాబాద్ శివార్లల్లో గోసంరక్షకులపై కాల్పులు:
ఫీజు బకాయిలు చెల్లించకపోతే సచివాలయం ముట్టడి!