పాకిస్తాన్ కోసమే కాంగ్రెస్ మేనిఫెస్టో

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ విడుదలచేసిన మేనిఫెస్టోపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ  విమర్శనాస్త్రాలు సంధించారు. ఆ మేనిఫెస్టో భారత్‌ కంటే పాకిస్థాన్‌లో ఎన్నికలకు సరిగ్గా సరిపోతుందన్నారు. అధికారంలోకి రావడానికి సమాజాన్ని విభజించాలని కాంగ్రెస్‌ లక్ష్యంగా పెట్టుకున్నదని ఆరోపించారు. 
 
ఇది బుజ్జగింపు రాజకీయమని విమర్శించారు. బుజ్జగింపు రాజకీయాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని వెల్లడించారు. ఇది భారత్‌లో ఎన్నికల కోసం కాదని పాకిస్థాన్ కు సంబంధించిన మేనిఫెస్టో అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. జోర్హాట్ నియోజకవర్గంలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.
 
దేశంలో ఏ వ్యక్తయినా, అది హిందువైనా, ముస్లిమైనా ట్రిపుల్ తలాక్ పునరుద్ధరణ కోరుకోరని, బాల్య వివాహాలు, బహుభార్యత్వానికి మద్దతునివ్వరని చెప్పారు. సమాజాన్ని విభజించి అధికారంలోకి రావాలనే మనస్తత్వం కాంగ్రెస్ పార్టీదని ధ్వజమెత్తారు. రానున్న ఎన్నికల్లో అస్సాంలోని 14 ఎంపీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
 
” దేశంలో ఎవరూ ట్రిపుల్ తలాక్ పునరుద్ధరణను కోరుకోవడం లేదు. బాల్య వివాహాలు, బహుభార్యత్వాన్ని సమర్థించడం లేదు. సమాజాన్ని విభజించి అధికారంలోకి రావాలనేది కాంగ్రెస్ కుట్ర.” అని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ  ఆగ్రహం వ్యక్తం చేశారు.  కాగా, హిమంత ఆరోపణలపై కాంగ్రెస్‌ పార్టీ ఆగ్రహం వ్యక్తంచేసింది. లౌకిక, సమ్మిళిత తత్వాన్ని బీజేపీ అర్థం చేసుకోలేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి బేదబ్రత బోరా ధ్వజమెత్తారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రయోజనాలను కాపాడడమే తమ మేనిఫెస్టో లక్ష్యమని స్పష్టం చేశారు.