అగ్ని ప్రైమ్‌ మిస్సైల్‌ ప్రయోగం విజయవంతం

అగ్ని ప్రైమ్‌ మిస్సైల్‌ ప్రయోగం విజయవంతం
 
డీఆర్డీవో సహకారంతో భారత సైన్యం విజయవంతంగా అగ్ని ప్రైమ్‌ మిస్సైల్‌ను విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని ఏపీజే అబ్దుల్‌ కలాం ద్వీపం నుంచి బుధవారం రాత్రి ఈ మిస్సైల్‌ను పరీక్షించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ తో కలిసి కొత్త తరం మిస్సైల్‌ను పరీక్షించగా నిర్దేశిత అన్ని లక్ష్యాలను తాకిందని పేర్కొంది.
 
వివిధ ప్రదేశాల్లో మోహరించిన అనేక శ్రేణి సెన్సార్ల డేటా ఆధారంగా ఈ క్షిపణి దానికి నిర్దేశించిన అన్ని లక్షాలను పూర్తి చేసిందని రక్షణశాఖ పేర్కొంది. సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్, చీఫ్ ఆఫ్ స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ సహా పలువురు సీనియర్ డీఆర్డీవో అధికారులు ప్రయోగాన్ని పరిశీలించారు. ఈ మిస్సైల్‌ అణ్వాయుధాలను సైతం మోసకెళ్లనున్నది. అగ్ని ప్రైమ్ క్షిపణిని ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ కింద దేశీయంగా అభివృద్ధి చేశారు.
 
 ఇంతకు ముందు జూన్ 7న కూడా డీఆర్డీవో అగ్ని ప్రైమ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. అగ్ని ప్రైమ్‌ క్షిపణి పరీక్ష విజయవంతంగా పరీక్షించడంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ హర్షం వ్యక్తం చేశారు. డీఆర్డీవో, స్ట్రాటజిక్‌ ఫోర్సెస్‌ను అభినందించారు. మిస్సైల్‌ విజయవంతం కావడంతో భద్రతా బలగాలకు మరింత బలం చేకూరుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. చైనా, పాకిస్థాన్ వంటి దేశాలకు వ్యతిరేకంగా భారత్‌కు బలమైన శక్తిని ఇది అందిస్తుందని భావిస్తున్నారు.
 
 అగ్ని ప్రైమ్ బాలిస్టిక్ మిస్సైల్‌ మీడియం రేంజ్ క్షిపణి. దీని రేంజ్‌ 1200-2000 కిలోమీటర్ల మధ్య ఉంటుంది. టార్గెట్స్‌ను ఖచ్చితత్వంతో ఛేదించడం దీని ప్రత్యేకత. అణ్వాయుధాలను సైతం మోసుకెళ్లగలదు. 1500 నుంచి 3000 కిలోల వార్‌హెడ్‌ను మోసుకెళ్లనున్నది. మిస్సైల్‌ బరువు దాదాపు 11వేల కిలోలు. 
అగ్ని సిరీస్‌లో ఇది ఆరో మిస్సైల్‌. ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ కింద ఈ క్షిపణిని అభివృద్ధి చేశారు. ప్రోగామ్‌లో పృథ్వీ, అగ్ని, త్రిశూల్, నాగ్, ఆకాశ్‌ తదితర మిస్సైల్‌ను అభివృద్ధి చేశారు.