‘కచ్చతివు’ ద్వీపం శ్రీలంకకు బదలాయింపుపై దుమారం

2024 లోక్ సభ ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీపై మరో ‘పిడుగు’ పడింది. ‘కచ్చతివు ద్వీపం’ కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీలంకకు ఇచ్చేసిందంటూ ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. భారత దేశాన్ని విడదీసి, భారత్లో ఒక భాగమైన ద్వీపాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీలంకకు ఇచ్చేసిందని ఆరోపించారు. ఈ దీవుల యాజమాన్య హక్కుల కోసం జరుగుతున్న వివాదాన్ని నివారించేందుకు 1974లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధికి ఈ విషయం చెప్పి, కచ్చతీవు దీవులను శ్రీలంకకు కట్టబెట్టారని ఆరోపించారు. ఈ విషయం  ఆర్టీఐ దరఖాస్తుతో తాజాగా బయటపడిందని చెప్పారు. ఇది తెలిసిన ప్రతీ భారతీయుడు కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాడని ప్రధాన పేర్కొన్నారు. భారతదేశ ఐకమత్యాన్ని, సమగ్రతతను, ప్రయోజనాలను 75 ఏళ్లుగా కాంగ్రెస్ దూరం చేస్తూనే ఉందని ధ్వజమెత్తారు. దేశ ప్రయోజనాల విషయంలో కాంగ్రెస్ పార్టీని నమ్మలేమని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ట్వీట్ చేశారు. 

బిజెపి తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై చేసిన ఆర్టీఐ దరఖాస్తుతో కచ్చతీవు దీవుల విషయం వెలుగులోకి వచ్చింది. 1974 జూన్ లో కచ్చతీవు దీవులపై పూర్తి హక్కులను శ్రీలంకకు అప్పగిస్తున్నట్లు అప్పటి తమిళనాడు సిఎం కరుణానిధికి విదేశాంగ శాఖ కార్యదర్శి కేవల్ సింగ్ సమాచారం అందించినట్లు వెల్లడైంది.

తమిళనాడులోని రామేశ్వరం –  శ్రీలంకకు మధ్యలో ఉన్న ఓ చిన్న ద్వీపం ఈ కచ్చతివు. ఇది 285 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. తమిళనాడు నుంచి కేవలం 25కి.మీల దూరంలోనే ఉంటుంది ఈ ద్వీపం. దీనిపై చాలా సంవత్సరాలుగా వివాదం ఉన్నప్పటికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం చేసిన ఓ ట్వీట్తో ఇప్పుడు ఈ కచ్చతివు వ్యవహారం వెలుగులోకి వచ్చింది.  “ఆశ్చర్యకరమైన విషయం! కచ్చతివును కాంగ్రెస్.. శ్రీలంకకు ఇచ్చేసిందని కొత్త ఆధారాలు బయటకు వచ్చాయి. ఇది భారతీయులను ఆగ్రహానికి గురి చేస్తోంది. కాంగ్రెస్ను నమ్మలేమని ప్రజల్లో ఉన్న ఆలోచనలు మళ్లీ నిరూపితమయ్యాయి,” అని ట్వీట్ చేశారు ప్రధాని మోదీ.

భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రు హయాంలోనూ ఈ కచ్చతివు వివాదం కొనసాగింది. అయితే ‘ఇంత చిన్న విషయాన్ని మాటిమాటికి ప్రస్తాతవించకండి. అవసరమైతే కచ్చతివును వదులుకోవడానికి సిద్ధం’ అని నెహ్రూ అన్నట్టు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నమళై వ్యాఖ్యానించారు. ఆర్టీఐ ద్వారా తాను సంపాదించిన రెండు పత్రాలలో నెహ్రూ ఈ మెరకు వ్యాఖ్యానించినట్టు ఉందని పేర్కొన్నారు.

కానీ కచ్చతివు అనే ప్రాంతం భారత్ లో ఒక భాగమని నిరూపించేందుకు అనేక ఆధారాలు ఉన్నట్టు, అప్పటి అటార్నీ జనరల్ వాదించారు. ఈ విషయం కూడా  అన్నమళై పొందిన పత్రాలలో ఉంది. ‘కళ్లు తెరిపించే, ఆశ్చర్యకర చర్యలు ప్రపంచానికి తెలిశాయి. కచ్చతీవు దీవులను కాంగ్రెస్ పార్టీ ఎలా వదులుకుందో ఇప్పుడు తెలిసింది. ఈ చర్య ప్రతి భారతీయుడికి కోపం తెప్పిస్తోంది. కాంగ్రెస్ పార్టీని ఎప్పటికీ విశ్వసించలేం. దేశ ఐక్యత, సమగ్రత, ప్రయోజనాలను బలహీన పరచడం ఆ పార్టీ విధానం. 75 ఏళ్లు దేశాన్ని ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ పాలించింది అని’ ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు.

వేసవి కావడంతో భారత జలాల్లో చేపలు తగ్గిపోతున్నాయి. రామేశ్వరం, సమీప జిల్లాలకు చెందిన మత్స్యకారులు చేపలు పట్టేందుకు కచ్చతీవు ద్వీపానికి వెళుతున్నారు. అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖ దాటి వెళ్లడంతో శ్రీలంక నౌకాదళం అదుపులోకి తీసుకుంది. దాంతో సమస్య వెలుగులోకి వచ్చింది. ఆ వెంటనే ఆర్టీఐ ద్వారా సమాచారం బయటకు వచ్చింది. ఆ అంశాన్ని ప్రధాని మోదీ ప్రస్తావించారు.

1974లో ఈ కచ్చతివు ద్వీపాన్ని భారత్ నిజంగానే శ్రీలంకకు ఇచ్చేసింది! ఈ మేరకు కచ్చితువు శ్రీలంకకు చెందినది అని ఇందిరా గాంధీ నేతృత్వంలోని ప్రభుత్వం గుర్తించింది. ఇదే విషయంపై 1974 జూన్ 26న శ్రీలంకలో, రెండు రోజుల తర్వాత జూన్ 28న ఢిల్లీలో సంబంధిత ఒప్పందాలపై సంతకాలు చేశారు.

ఈ కచ్చతివులో చేపలు పట్టేందుకు చాలా మంది తమిళులు వెళుతూ ఉంటారు. కానీ ఇప్పుడది చాలా కష్టంగా మారింది. ఇంటర్నేషనల్  మేరిటైమ్ బౌండరీ లైన్కి అవతల ఉన్న ఈ ప్రాంతానికి వెళుతుంటే శ్రీలంక అధికారులు మత్స్యకారులను అరెస్ట్ చేస్తున్నారు. కచ్చితివును శ్రీలంకలో భాగంగా భారత్ గుర్తించడం చాలా మంది తమిళులకు ఇష్టం లేదు.

కచ్చతివులో సెయింట్ ఆంటోని ఆలయం ఉంటుంది. ప్రతియేటా అక్కడ ఉత్సవాలు జరుగుతాయి. 1974లో జరిగిన ఒప్పందం ప్రకారం భారత మత్స్యకారులు ఉత్సవంలో పాల్గొనవచ్చు. అక్కడ విశ్రాంతి తీసుకోవచ్చు. కానీ వేటకు వెళుతున్న వారికి మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాగా  కచ్చతివుని శ్రీలంకకు ఇచ్చేయడంపై అప్పటి విపక్ష పార్టీలు తీవ్రంగా నిరసన వ్యక్తం చేశాయి. కానీ ఇందిరా గాంధీ ప్రభుత్వం వాటిని పట్టించుకోకుండా, శ్రీలంకకు అప్పజెప్పిందని తెలుస్తోంది. శ్రీలంకతో సత్సంబంధాల కోసమే అప్పటి భారత ప్రభుత్వం ఇలా చేసిందని వార్తలు వచ్చాయి.

అయితే, దాదాపు 50 ఏళ్ల నాటి సమస్యపై తన ప్రభుత్వం అందించిన సమాచారం  ఆధారంగా ప్రధాని మోదీ కళ్లు తెరవడం పట్ల విస్మయం వ్యక్తం చేస్తూ కచ్చతీవు ద్వీపం వ్యవహారం దౌర్భాగ్యమే అయినా అది కాలం చెల్లిన రాజకీయ సమస్య అని డీఎంకే అధికార ప్రతినిధి ఎస్ మనురాజ్ కొట్టిపారేసారు. పదేళ్లు అధికారంలో ఉన్న తర్వాత కూడా ప్రతిపక్షాలపై నిందలు వేయడంలో బీజేపీ నిమగ్నమైందని డీఎంకే చురకలంటించింది. ఈ పదేళ్ల కాలంలో తాను సాధించిన విజయాలపై ప్రచారం చేసేందుకు బీజేపీ భయపడుతోందని, అందుకే ప్రతిపక్షాలపై ఆరోపణలు చేయడంపైనే దృష్టి సారించింది డీఎంకే ఎద్దేవా చేసింది.

మరోవంక, శ్రీలంకకు కచ్చాతీవును ఇందిరా గాంధీ ఇచ్చివేయడంపై ప్రధాని మోదీ  చేసిన ఆరోపణను  ఖండిస్తూ  పది సంవత్సరాల పాలనలో ఆ దీవిని వెనుకకు తీసుకోవడానికి ఎందుకు చర్యలు గైకొనలేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే  ప్రశ్నించారు. తూర్పు లడఖ్‌లోని గల్వాన్ లోయలో 20 మంది జవాన్లు ప్రాణ త్యాగం చేసిన తరువాత చైనాకు ప్రధాని ‘క్లీన్ చిట్’ ఎందుకు ఇచ్చారని 1974లో ఒక స్నేహపూర్వక ఒప్పందంలో భాగంగా శ్రీలంకకు కచ్చాతీవు దీవిని ఇవ్వడమైందని చెబుతూ  సరిహద్దు గ్రామాల మార్పిడిలో భాగంగా మోదీ ప్రభుత్వం కూడా బంగ్లాదేశ్ పట్ల అటువంటి ‘స్నేహపూర్వక వైఖరి’ ప్రదర్శించిందని ఖర్గే గుర్తు చేశారు. ‘