
* గాజాలో 70మందికి పైగా మృతి
సిరియాలోని ఉత్తర రాష్ట్రమైన అలెప్పోలో ఇజ్రాయిల్ జరిపిన వైమానిక దాడుల్లో 42మంది మరణించారని సిరియా అధికారిక వార్తా సంస్థ సనా తెలిపింది. వీరిలో ఎక్కువమంది సైనికులే వున్నారు. హిజ్బుల్లా తిరుగుబాటుదారులు ఆరుగురు చనిపోయినట్లు ఓ టివి చానెల్‌లో తెలిపింది. ఈ దాడుల్లో డజన్ల సంఖ్యలో గాయపడినట్లు బ్రిటన్ కేంద్రంగా పనిచేసే సిరియా మానవ హక్కుల కార్యాలయం (ఎస్‌ఓహెచ్‌ఆర్) తెలిపింది.
అలెప్పోలోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని శుక్రవారం తెల్లవారు జామున 1.45గంటల తర్వాత ఈ దాడులు మొదలైనట్లు సిరియా రక్షణ మంత్రిత్వ శాఖ కార్యాలయం తెలిపింది. అలెప్పో అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఆయుధాల డిపోపైనా ఇజ్రాయిల్ వైమానిక దాడులు జరిపింది.
ఇజ్రాయిల్ గాజాతో బాటు ఇరాన్ మిత్రదేశమైన సిరియాపై కూడా వరుస దాడులకు దిగుతోంది. గాజా కరువు బారిన పడే పరిస్థితులను నిలువరించాలని, వెంటనే ఇందుకు సంబంధించి చర్యలు చేపట్టాలని అంతర్జాతీయ న్యాయ స్థానం గురువారం రూలింగ్ ఇచ్చినప్పటికీ ఇజ్రాయిల్ తన ఘర్షణ ధోరణిని విడనాడడం లేదు.
హిజ్బుల్లాపై దాడులను కొనసాగిస్తూనే వుంది. ఈ దాడులు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తున్నాయని, సిరియా సార్వభౌమాధికారాన్ని దెబ్బతీస్తున్నాయని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ శుక్రవారం వ్యాఖ్యానించింది.
మరోవంక, గత 24గంటల్లో ఇజ్రాయిల్ హంతక దాడుల్లో 71మంది పాలస్తీనియన్లు మరణించగా, మరో 112మంది గాయపడ్డారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గాజాలోని స్పోర్ట్స్ సెంటర్‌పై ఇజ్రాయిల్ జరిపిన దాడిలో 15మంది మృతి చెందగా, జబాలియా శరణార్ధి శిబిరంలోని అబి వక్తాస్ మసీదుపై జరిపిన బాంబు దాడిలో పలువురు గాయపడ్డారు.
ఆహారం, నీరు, ఇంధనం, వైద్య సరఫరాలతో సహా గాజాలోని ప్రజలకు ఎలాంటి అడ్డంకులు, అవాంతరాలు లేని రీతిలో మౌలిక సౌకర్యాలు అందించాలని, మానవతా సాయం పెంపొందించాలని, ఎలాంటి జాప్యం లేకుండా ఇందుకు సంబంధించి చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ న్యాయ స్థానం (ఐసిజె) జారీ చేసిన ఆదేశాలను కూడా నెతన్యాహు ప్రభుత్వం ధిక్కరిస్తోంది.
గాజాలో పరిస్థితులు క్షీణిస్తున్నాయని, మానవ తప్పిదం వల్ల జరిగే ఈ పెను విషాదాన్ని నివారించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాల్సి వుందని ఐక్యరాజ్య సమితి పాలస్తీనా శరణార్ధుల సంస్థ (యుఎన్‌ఆర్‌డబ్ల్యుఎ చీఫ్ ఫిలిప్ లాజారిని పేర్కొన్నారు.
More Stories
వారణాసిలో చదివిన నేపాల్ కాబోయే ప్రధాని కార్కి
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కిని ఒప్పించిన ఆర్మీ చీఫ్
పాక్, స్విట్జర్లాండ్లకు భారత్ హెచ్చరిక