బీజేపీలో చేరిన కీలక పంజాబ్ కాంగ్రెస్ నేత

బీజేపీలో చేరిన కీలక పంజాబ్ కాంగ్రెస్ నేత
 
* పంజాబ్ లో బిజెపి ఒంటరిగా పోటీ
 

లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీకి పంజాబ్ లో గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలక నేత, సిట్టింగ్‌ ఎంపీ రణ్‌వీత్‌ సింగ్‌ బిట్టూ బీజేపీలో చేరారు. ఢిల్లీలో బీజేపీ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర బీజేపీ నేతల సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. బిట్టూ 2021 మార్చి నుంచి జూలై వరకు కాంగ్రెస్‌ లోక్‌సభాపక్ష నాయకుడిగా వ్యవహరించారు.

రణ్‌వీత్‌ సింగ్‌ బిట్టూ ప్రస్తుతం లూథియానా నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో కూడా బిట్టూ ఇక్కడి నుంచే విజయం సాధించి పార్లమెంటులో అడుగుపెట్టారు. అంతకుముందు 2009లో ఆయన ఆనంద్‌పూర్‌ సాహిబ్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు. ఇలా వరుసగా మూడు పర్యాయాలు కాంగ్రెస్ ఎంపీగా గెలిచిన బిట్టూ ఇప్పుడు పార్టీ మారి బీజేపీలో చేరారు. 2021 జనవరిలో జన్‌ సంసద్‌ కార్యక్రమం సందర్భంగా బిట్టూపై దాడి జరిగింది. ప్రస్తుతం బిట్టూ పార్టీని వీడటానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

కాగా, శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఎడి)తో తమ పొత్తు చర్చలు విఫలమయ్యాయని సూచనప్రాయంగా తెలియచేస్తూ పంజాబ్‌లోని రానున్న లోక్‌సభ ఎన్నికలలో తాము ఓంటరిగానే పోటీ చేస్తామని బిజెపి మంగళవారం ప్రకటించింది. బిజెపి ఒంటరి పోరుతో రాష్ట్రంలో చతుర్ముఖ పోటీ అనివార్యంగా కనపడుతోంది. పంజాబ్‌లోని 13 లోక్‌సభ నియోజకవర్గాలకు జూన్ 1న పోలింగ్ జరగనున్నది.

 మొత్తం అన్ని లోక్‌సభ స్థానాలలో ఒంటరిగా పోటీ చేస్తామని పంజాబ్ బిజెపి అధ్యక్షుడు సునీల్ జాకఢ్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రకటించారు. ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నాయకుల అభిప్రాయం మేరకు తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. పంజాబ్ భవిష్యత్తు కోసం, యువజనులు, రైతులు, వ్యాపారులు, కార్మికులు, అణగారిన వర్గాల కోసం తీ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

పంజాబ్ ప్రజలు తమ పార్టీకి భారీ విజయాన్ని అందచేస్తారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. 1996లో బిజెపితో పొత్తు కుదుర్చుకున్న ఎస్‌ఎడి 2019 లోక్‌సభ ఎన్నికలలో కూటమి చెరో రెండు స్థానాలలో విజయం సాధించింది. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ 2020 సెప్టెంబర్‌లో బిజెపితో సంబంధాలు తెగతెంపులు చేసుకుంది.