ఏపీలోని 6 ఎంపీ సీట్లకు బీజేపీ అభ్యర్థుల ప్రకటన

* తెలంగాణాలో మరో  ఇద్దరు అభ్యర్థుల ప్రకటన
 
2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి బీజేపీ ఐదో జాబితా విడుదల చేసింది. మొత్తం 111 మంది అభ్యర్థుల పేర్లతో భారతీయ జనతా పార్టీ ఐదో జాబితా విడుదల చేసింది. ఏపీలోని ఆరు ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఆదివారం ఉదయమే పార్టీలోకి చేరిన గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్‌కు బీజేపీ తిరుపతి ఎంపీ సీటు కేటాయించింది. 
 
అరకు నుంచి కొత్తపల్లి గీత, అనకాపల్లి లోక్‍‌సభ స్థానం నుంచి సీఎం రమేష్, రాజంపేట నుంచి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, నర్సాపురం నుంచి శ్రీనివాసవర్మ, తిరుపతి నుంచి వరప్రసాదరావు, రాజమండ్రి లోక్ సభ స్థానం నుంచి దగ్గుబాటి పురంధేశ్వరి పోటీ చేయనున్నారు.

  • అరకు- కొత్తపల్లి గీత
  • అనకాపల్లి – సీఎం రమేష్
  • రాజంపేట- కిరణ్ కుమార్ రెడ్డి
  • నర్సాపురం- భూపతిరాజు శ్రీనివాసవర్మ
  • తిరుపతి- వరప్రసాదరావు
  • రాజమండ్రి- దగ్గుబాటి పురంధేశ్వరి

వీరిలో ముగ్గురు మాజీ లోక్ సభ సభ్యులు, ఒకరు మాజీ రాజ్యసభ సభ్యుడు ఉండగా, ఒకరు మాజీ ఎమ్యెల్యేగా, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇద్దరు అదే నియోజకవర్గం నుండి గతంలో గెలుపొందారు.

 
మరోవైపు నర్సాపురం నుంచి రఘురామకృష్ణంరాజు పోటీ చేస్తారనే వార్తలు వచ్చాయి. సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఆయన వచ్చే ఎన్నికల్లో నర్సాపురం నుంచి టీడీపీ, బీజేపీ, జనసేన తరుఫున ఏదో ఒక పార్టీ తరుఫున పోటీ చేస్తానంటూ చెబుతూ వచ్చారు. 
 
అయితే ఊహించని విధంగా నర్సాపురం నుంచి భూపతిరాజు శ్రీనివాసవర్మను బీజేపీ బరిలోకి దింపుతోంది. అలాగే తిరుపతి ఎంపీ సీటుకు వైసీపీ నుంచి ఆదివారం ఉదయమే పార్టీలో చేరిన గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్‌ను బీజేపీ ఎంపిక చేసింది.
 
కాగా, ఇప్పటికే తెలంగాణాలో15 మందికి సీట్లు ఖరారు చేసిన బీజేపీ తాజాగా మరో రెండు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. వరంగల్‌ (ఎస్సీ) స్థానానికి ఇటీవల బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన ఆరూరి రమేష్, ఖమ్మం నుంచి తాండ్ర వినోద్‌రావులను ఎంపిక చేశారు.